మంగళవారం 26 మే 2020
National - May 13, 2020 , 22:25:40

రోడ్డెక్కనున్న ప్రగతి రధ చక్రాలు

రోడ్డెక్కనున్న ప్రగతి రధ చక్రాలు

అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఇంకా ఎక్కువ రోజులు లాక్ డౌన్ విధిస్తే జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుందని భావించి లాక్ డౌన్ విధించినా కొన్నిటికి సడలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజా రవాణా కొనసాగేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని నిర్ణయించారు. అందుకోసం 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ప్రజా రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బస్సులు నడపనున్నారు. అయితే బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్ల సర్దుబాటు చేసేలా ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ పీటీడీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో అన్ని రీజియన్‌లలో ఉన్నతాధికారులు వివిధ డిపోల్లోని డీఎం, తదితరులను అప్రమత్తం చేశారు. బస్సులను కండీషన్ లో పెట్టుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారు.


logo