బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 13:29:07

రేప్ కేసులను ఛేదించడంలో డీఎన్ఏదే ప్రధాన పాత్ర

రేప్ కేసులను ఛేదించడంలో డీఎన్ఏదే ప్రధాన పాత్ర

 ఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లైంగిక నేరాలు పెరుగుతూనే న్నాయి. గత నెలలో ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మైనర్లపై లైంగిక నేరాలు ఎక్కువగా జరిగాయి.  ఇటువంటి కేసుల్లో  బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులు లేదా చుట్టుపక్కల వారే నిందితులుగా ఉన్నారట. లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాల్లో మైనర్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం-2012 ఎంతో ఉపయోగపడుతున్నది . అయినప్పటికీ బాధితులు కోర్టుకెక్కేందుకు భయపడుతుండడంతో నిందితులు తప్పించుకుంటున్నారు. కుటుంబసభ్యులు, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లే దీనికి కారణం. దీంతో నిందితులు కోర్టుల్లో శిక్ష పడకుండా తప్పించుకోగలిగేవారు. ఈ నేపథ్యంలో అటువంటి కేసుల్లో కోర్టులు ఫోరెన్సిక్ డీఎన్ఏ పరీక్షలను ప్రామాణికంగా తీసుకోవడం ప్రారంభించాయి. దీనివల్ల అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఆరు నెలలుగా వేగంగా పరిష్కారమవుతున్నాయి. ముఖ్యంగా మైనర్లకు సంబంధించిన కేసుల్లో ఈ విధానం మంచి ఫలితాలనిస్తున్నది. ఇటీవలి అంచనాల ప్రకారం, నేరం జరిగిన ప్రాంతాల నుంచి సేకరించిన డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ (డీఎన్‌ఏ) శాంపిల్స్ సంఖ్య గత ఏడాదితో పోల్చితే రెట్టింపు అయినట్లు అధికారులు చెబుతున్నారు. 2017లో 10వేల కేసుల్లోనే డీఎన్ఏ శాంపిల్స్ సేకరించగలిగిన సిబ్బంది,  2019లో 20వేల కేసుల్లో శాంపిల్స్ సేకరించగలిగారని అధికారులు తెలిపారు. శాంపిల్స్ సేకరణ, పరీక్షా ఫలితాల్లో వృద్ధి కనిపించినప్పటికీ, అత్యాచార నేరాలతో పోల్చితే ఈ సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉందని వివరిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం మహిళలపై నేరాల సంఖ్య గత ఆరేండ్లలో గణనీయంగా పెరిగిందని, 2012లో 24,923 కేసులు ఉంటే, 2018 నాటికి ఆ సంఖ్య 33,356 కేసులకు అంటే 34శాతం వృద్ధి కనిపించిందని 2019 నుంచి ఈ ఏడాది వరకు కూడా అదే స్థాయిలో నేరాల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో మైనర్లపై అత్యాచారాలకు పాల్పడిన వారిని ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే కోర్టులు గుర్తించి శిక్షించాయి.  ‘‘రాజ్యాంగం ప్రకారం అత్యాచార బాధితుల ఏకైక సాక్ష్యం మీదనే కోర్టులలో ప్రాసిక్యూషన్‌ ఆధారపడి ఉంటుంది. అత్యాచార నిందితుడిని శిక్షించడానికి బాధితురాలి మౌఖిక సాక్ష్యం సరిపోయినప్పటికీ, దానికి కొన్ని పరిమితులున్నాయి. ఆలస్యం కారణంగా, తరచుగా బాధితురాలి జ్ఞాపక శక్తి సన్నగిల్లడం జరుగవచ్చు. ఈ కారణంతో డిఫెన్స్‌ న్యాయవాది క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సమయంలో బాధితురాలిని గందరగోళానికి గురి చేసి, బాధితురాలి ప్రకటనలు పరస్పర విరుద్ధంగానూ, తప్పుగానూ ఉన్నాయని నిరూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజం తమను బహిష్కరిస్తుందనే భయం నేపథ్యంలో బాధితులు కూడా కోర్టులో నిజం చెప్పేందుకు అనేక సార్లు వెనకడుగు వేస్తుంటారని " సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, వివేక్‌ సూద్‌ చెబుతున్నారు." చాలా వరకూ కేసులలో నేరం ఋజువు చేసేందుకు సరైన సాక్ష్యాలు లేదా ప్రత్యక్ష సాక్ష్యులు లేనందున కోర్టులు నిందితులను శిక్షించలేవు. అలాంటి పరిస్థితులలో డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా నిందితులను గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం  లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి ఈ విధానం అత్యంత కీలకంగా మారిందని ఆయన వివరించారు. ‘2018లో దేశవ్యాప్తంగా నమోదైన అత్యాచార కేసుల్లో నాలుగింట ఒక వంతు బాధితులు మైనర్లే. వారిలోనూ దాదాపు 95శాతం మంది బాగా తెలిసిన వారే దాడికి పాల్పడ్డారు. ఈ గణాంకాలు లైంగికంగా వేధించే వారికి బలయ్యేది చిన్నారులే అని వివరించడమే కాదు, అత్యాచారానికి గురైన వారిపై కుటుంబ సభ్యులు ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో కూడా వివరిస్తాయి. ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ సాంకేతికత ఇప్పుడు ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపుతున్నదని "ఢిల్లీ పోలీస్‌ అధికారి సుమన్‌ నాల్వా తెలిపారు.  ప్రస్తుతం కరోనాతో పోరాటంలో పాల్గొంటున్నప్పటికీ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించిన దర్యాప్తులపై కూడా ఢిల్లీ పోలీసులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. సిబ్బందికి తగిన రీతిలో నమూనాలను సేకరించడం, ఆ నమూనాలను సరిగా రవాణా చేయడం, నిర్వహించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని సుమన్‌ నాల్వా అన్నారు. ఇలాంటి కేసుల్లో ఎంతో కీలకంగా మారిన డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను కూడా మెరుగు పరచుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం నెలకొందని నిపుణులు చెబుతున్నారు.   కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించిందని, ఇటీవలే మొట్టమొదటి అత్యాధునిక డీఎన్‌ఏ ఎనాలసిస్‌ యూనిట్‌ సీఎఫ్‌ఎస్‌ఎల్‌‌ను చండీఘడ్‌‌లో ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. మరో 13 రాష్ట్రాల్లోనూ డీఎన్‌ఏ ఎనాలిసిస్‌ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు అనుమతి కూడా లభించింది. 


logo