శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 00:50:09

ఏపీలో ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్

ఏపీలో ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్

అమరావతి:  ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవైపు కరోనాతో పోరాడుతూనే.. మరోవైపు ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నది. ఈ మేరకు అధికారులకు  ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్‌ను రద్దు చేయనున్నది . దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్‌హెచ్‌వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు మినహాయింపు ఇచ్చింది. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పురపాలక కమిషనర్ లేదా ఎంపీడీవోలకు పంపించింది. ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పింఛను రద్దు చేయాలని యోచిస్తున్నది. పరిశీలన బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) రాజబాబు ఆదేశాలు జారీ చేశారు.


logo