గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 21:59:35

నర్సుల సేవలు ప్రశంసనీయం : పవన్ కళ్యాణ్

 నర్సుల సేవలు ప్రశంసనీయం : పవన్ కళ్యాణ్

అమరావతి : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం  ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కరుణతో రోగులను సంరక్షిస్తున్న గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకి నా తరఫున, జనసేన తరఫున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు’ అని పవన్ తెలిపారు.  వృత్తి రీత్యా నర్సు అయినా అస్పత్రిలో వినిపించేది సిస్టర్ అనే మాటే అని పేర్కొన్నారు. ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా భావించి రోగులకు సపర్యలు చేస్తారని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ విపత్కర సమయంలో ఆసుపత్రుల్లో, ఐసోలేషన్ వార్డుల్లో నర్సులు సాహసంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ వారసత్వాన్ని కరోనా సమయంలో నర్సులు కొనసాగిస్తున్న తీరు సర్వదా ప్రశంసనీయం అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో నర్సింగ్ విభాగం చాలా అవసరం అని పవన్ పేర్కొన్నారు. ఈ వృత్తిలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన వేతనాలు అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. 


logo