శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 21:23:31

గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటి సర్వే

గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటి సర్వే


వైజాగ్ : విశాఖపట్నం సమీపంలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలో ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో ఉన్న రసాయనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారన్నారు. ఐదు గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యం కోసం ఐదు మెడికల్‌ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘటన అనంతరం 90 శాతం మంది ప్రజలు వారి వారి గ్రామాలకు చేరుకున్నారని మంత్రి తెలిపారు.అదేవిధంగా గ్యాస్‌ లీక్‌ బాధిత గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ.10వేలు నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. మరికొన్ని గ్రామాలను కూడా బాధిత గ్రామాల్లో చేర్చాలని అడుగుతున్నారని.. వాటిని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం బాధిత గ్రామాలకు మంచి నీటిని అందిస్తున్నామని, ఆయా గ్రామాల్లోని ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు అభద్రతకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని మంత్రి బొత్స అన్నారు.


logo