ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 14:35:29

మెట్రో రైళ్ల లో కాంటాక్ట్ లెస్ టికెటింగ్ విధానం...

 మెట్రో రైళ్ల లో కాంటాక్ట్ లెస్ టికెటింగ్ విధానం...

ఢిల్లీ :దేశంలో మరికొన్ని రోజుల్లో కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు ముగియనున్నది. అప్పటి పరిస్థితులనుబట్టి లాక్ డౌన్ పొడిగించాలా? లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపింది. లాక్ డౌన్ ఎత్తేస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందనే దానిపై వారు కసరత్తు చేశారు. ముఖ్యంగా ప్రయాణాల విషయం లో జనాల రద్దీ ని తగ్గించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే అందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. లాక్ డౌన్ ఎత్తేస్తే కార్యాలయాలకు వెళ్లే  ఉద్యోగులు, స్కూళ్ళు,కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సహా అన్ని వర్గాల వారు ఒక్కసారిగా రోడ్లమీదకు వస్తే తీవ్రమైన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నది.  దీంతో ఇప్పటి వరకూ చేసిన కరోనా నియంత్రణ వృథా అవుతుంది. అందుకోసమే అటువంటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు అధికారులు. అందులో భాగంగానే ఢిల్లీ లో మెట్రోరైలు ప్రయాణికుల విషయంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ బుకింగ్ కౌంటర్ ల వద్ద క్యూ లైన్లు పెరగకుండా,జనాల రద్దీని తగ్గించేందుకు "కాంట్రాక్టు లెస్ టికెటింగ్"విధానాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఉన్న టోకెన్ల విధానానికి బదులుగా ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. స్మార్ట్ కార్డులను రీఛార్జ్ చేసుకొని తద్వారా కాంటాక్ట్ లెస్ టికెట్ తో మెట్రోరైలులో ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. కోవిడ్-19 నియంత్రణ లో సామాజిక దూరాన్ని పాటించడం ప్రధానం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ కాంటాక్ట్ లెస్ టికెటింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఢిల్లీ మెట్రో రైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఒకేసారి జనాలు రోడ్లపైకి రాకుండా, ముందుగా చర్యలు తీసుకోవాలని, రైళ్లు కూడా అవసరాన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి నడపాలని కేంద్ర సర్కారు సూచించింది. విమాన సర్వీసుల్లోనూ ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేయనున్నారు. భౌతిక దూరాన్ని పాటించేలా అవసరమైన మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సీట్ల మధ్య ఖాళీ ఉంచడంతో పాటు ప్రయాణికులు ఫ్లయిట్ ఎక్కే రెండు గంటల ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎవరెవరు ఎక్కడెక్కడకు వెళుతున్నారనే వివరాలను నమోదు చేయాలని కేంద్రం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐ ఎస్ ఎఫ్) ను కోరింది. ప్రయాణికుల సంఖ్య తగ్గించేందుకు సీఐ ఎస్ ఎఫ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే బయటకు రావాలని నిబంధన విధించింది. ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగించి తమ ఆరోగ్య పరిస్థితిని గురించి తెలు సుకొని ఎటువంటి సమస్యలేనివారు మాత్రమే బయటకు రావాలని సీఐ ఎస్ ఎఫ్ సూచిస్తున్నది.


logo