ఈ రోజుల్లో ఓ సినిమా చేస్తే అందులో డిలీటెడ్ సీన్స్ కూడా చాలానే కనిపిస్తున్నాయి. పక్కాగా బేరీజు వేసుకుని మరీ సరైన నిడివితో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. అలాంటి దర్శకులు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే నిర్మాతలకు ఖర్చు మిగిలిస్తూ పక్కాగా సినిమా చేస్తుంటారు. ఎడిటింగ్ టేబుల్ పై వాళ్ల కత్తెరకు పెద్దగా పనుండదు. కానీ కొందరు దర్శకులు మాత్రం రెండు సినిమాలకు సరిపోయే ఫీడ్ ఒకే సినిమాతో చేస్తుంటారు.
సుకుమార్, రాజమౌళి ఈ కేటగిరీలోకే వస్తుంటారు. ఎందుకంటే రెండున్నర గంటల సినిమా కోసం ఏకంగా మూడున్నర గంటలు చేస్తారు. అందులో గంటకు పైగా సినిమాను ఎడిట్ చేస్తుంటారు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా తన గురువు బాటలోనే వెళ్లాడు. ఈయన కూడా తన తొలి సినిమా ఉప్పెన కోసం ఎక్స్ ట్రా పార్టీ బాగానే తీసాడు. ఇప్పుడు డీలీటెడ్ సన్నివేశాలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఉప్పెన నుంచి విడుదలైన రెండు డిలీటెడ్ సన్నివేశాలు ఇప్పుడు అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా వైష్ణవ్ తేజ్, ఓ అమ్మాయి మధ్య వచ్చే సీన్ బాగానే ఉంది. గోదారి జిల్లాలో పాడుకునే సరదా పాటను కూడా ఈ డిలీటెడ్ సీన్ లో చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు. దాంతో పాటు విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా బాగానే ఉంది. కానీ ఎందుకు ఈ రెండు సన్నివేశాలను తీయాల్సి వచ్చిందో వాటిని చూస్తుంటేనే అర్థమైపోతుంది. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేని సన్నివేశాలే కావడంతో వాటిని తీసి పక్కనబెట్టాడు బుచ్చిబాబు. ఇంకా ఇలాంటి సీన్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడే లెక్కేయడం కష్టం. ఎందుకంటే రోజుకో సీన్ యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాడు బుచ్చిబాబు.