ఈ రోజుల్లో సినిమాలకు టైటిల్స్ పెట్టడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఒక సినిమాకు అద్భుతమైన టైటిల్ వర్కౌట్ అయింది అంటే సగం విజయం సాధించినట్లే. అందుకే టైటిల్ కోసం దర్శక నిర్మాతలు తల ప్రాణం తోకలోకి తెచ్చుకుంటారు. కొందరు హీరోలు మాత్రం ఏమాత్రం టెన్షన్ లేకుండా ఓల్డ్ టైటిల్స్ వాడుకుంటారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ కు ఇప్పుడు అదిరిపోయే ఇమేజ్ వుంది. ఈయన పాత టైటిల్స్ ఇప్పటికే చాలా మంది హీరోలు వాడుకున్నారు. ఇప్పుడు రవితేజ కూడా ఈ జాబితాలో జాయిన్ కాబోతున్నాడు. మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఒకటి లైన్ లో ఉండగానే మరో రెండు మూడు సినిమాలను క్యూలో పెడుతున్నాడు రవితేజ. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నఖిలాడి సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఈ వారంలోనే మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు మాస్ రాజా. హలో గురు ప్రేమకోసమే తర్వాత మరో సినిమా చేయని త్రినాధ రావు మాస్ రాజా కోసం తన రైటర్ ప్రసన్నకుమార్ తో కలిసి అదిరిపోయే కథ సిద్ధం చేశాడు.
ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించబోతున్నాడు రవితేజ. ఇప్పటి వరకు కెరీర్లో ఒక్కసారి కూడా న్యాయవాది పాత్రలో నటించలేదు మాస్ రాజా. ఈ క్యారెక్టర్ నచ్చి త్రినాథరావు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు చిరంజీవి ఆల్ టైం క్లాసిక్ టైటిల్ ఘరానా మొగుడు పరిశీలనలో ఉంది. ఈ సినిమా కథ కూడా ఘరానా మొగుడు తరహాలోనే ఉంటుందని.. అందుకే ఈ టైటిల్ అయితే బాగుంటుంది అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగి రవితేజ గాని ఘరానా మొగుడు టైటిల్ తో సినిమా చేశాడు అంటే అంచనాలు మామూలుగా ఉండవు. కానీ ఇలాంటి మాస్ టైటిల్స్ పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి. లేదంటే అసలుకే మోసం వస్తుంది. ఇలాగే చిరంజీవి టైటిల్స్ వాడుకొని వచ్చిన గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ, వేట లాంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అందుకే మాస్ రాజా కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు.