శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 14:33:51

త్రివిధ‌ ద‌ళాధిప‌తుల‌తో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్

త్రివిధ‌ ద‌ళాధిప‌తుల‌తో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డ‌కొనేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌వేళ ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌ని త్రివిధ ద‌ళాధిప‌తుల‌కు ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. తాజా ప‌రిస్థితిపై ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, సైన్యం, వాయుసేన‌, నేవీ అథిప‌తులు ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో గురువారం ర‌క్ష‌ణ మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏమైనా ఏర్ప‌డితే త‌క్ష‌ణం స్పందించేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. సైనిక ద‌ళాల సిబ్బందికి క‌రోనా సోక‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించిన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  

దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్‌ను అమ‌లుచేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. చాలాప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించి రోడ్ల‌పైకి వ‌స్తుండ‌టంతో వారిని నియంత్రించ‌టం పోలీసు విభాగానికి క‌ష్ట‌త‌రంగా మారింది. దాంతో కేసుల ఉదృతి పెరిగితే సైన్య‌స‌హాయం కూడా తీసుకోవాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.


logo