శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 13:21:18

200శాతం పెరిగిన గ్యాస్ బుకింగ్స్‌

200శాతం పెరిగిన గ్యాస్ బుకింగ్స్‌

దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ప్ర‌క‌టించటంతో గ్యాస్ బుకింగ్స్‌కోసం జ‌నం ఎగ‌బ‌డుతున్నారు. హోట‌ళ్లు ఇత‌ర ఆహార స‌ర‌ఫ‌రా సంస్థ‌లు మూత‌ప‌డ‌టంతోపాటు ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమితం కావ‌టంతో వంటగ్యాస్ వినియోగం పెరిగింది. అంతేకాకుండా గ్యాస్ కొర‌త ఏర్ప‌డ‌వ‌చ్చ‌న్న అనుమానాల‌తో కూడా చాలామంది గ్యాస్ బుకింగ్స్ కోసం ఎగ‌బ‌డుతున్నారని అధికాలు అంటున్నారు. అయితే వంట‌గ్యాస్‌కు దేశంలో ఎలాంటి కొర‌తా లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. కొన్నిచోట్ల  గ్యాస్ డెలివ‌రీలో ఏర్ప‌డుతున్న ఆల‌స్యం కూడా పోలీసుల త‌నిఖీల కార‌ణంగానేగానీ కొర‌త వ‌ల్ల కాద‌ని ఆల్ ఇండియా ఎల్పీజీ స‌ర‌ఫ‌రాదారుల సంఘం ఓ ప్ర‌కట‌న‌లో తెలిపింది. 

దేశంలో అతిపెద్ద వంట‌గ్యాస్ స‌ర‌ఫ‌రాదారు అయిన ఇండియ‌న్ ఆయిల్ కంపెనీకి మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 31 ల‌క్ష‌ల బుకింగ్స్ వ‌చ్చాయి. గ‌త ఆదివారం కేవ‌లం 9.84 ల‌క్ష‌ల బుకింగ్స్ మాత్ర‌మే రాగా రెండు రోజుల్లోనే అది 215శాతం పెర‌గ‌టం విశేషం. దేశ‌వ్యాప్తంగా ఉన్న 24,382 మంది వంట‌గ్యాస్ డిస్ర్టిబ్యూట‌ర్స్ రోజూ 50 నుంచి 52 ల‌క్ష‌ల వ‌ర‌కు వంట‌గ్యాస్ సిలిండ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని, ప్ర‌స్తుతం ఎలాంటి కొర‌తా లేద‌ని గ్యాస్ స‌ర‌ఫ‌రాదారుల సంఘం అధ్య‌క్షుడు చంద్ర‌ప్ర‌కాశ్ తెలిపారు. డిమాండ్ ఒక్క‌సారిగా పెర‌గ‌టంతో ప్ర‌భుత్వ గ్యాస్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో కేంద్ర చ‌మురుశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స‌మీక్ష నిర్వ‌హించి కొర‌త రాకుండా చూడాల‌ని ఆదేశించారు. 


logo