శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 02:17:05

క్విడ్‌ ప్రోకో!

క్విడ్‌ ప్రోకో!

-రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై ప్రతిపక్షాల మండిపాటు

-గొగోయ్‌ నియామకంపై పలువురు న్యాయమూర్తుల అసంతృప్తి

గువహటి, మార్చి 17: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ని రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. కేంద్రానికి అనుకూలంగా తీర్పులిచ్చినందుకే గొగోయ్‌కు రాజ్యసభ పదవి కట్టబెట్టారని మజ్లిస్‌ పార్టీ విరుచుకుపడింది. రాజస్థాన్‌ సీఎం, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ.. కేంద్రం తాజా నిర్ణయం గొగోయ్‌ గతంలో ఇచ్చిన తీర్పుల పారదర్శకతపై అనుమానాల్ని రేకెత్తించేలా చేస్తున్నదన్నారు. గొగోయ్‌ నియామకం ద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మోదీ సర్కారు బలహీనపరుస్తున్నదని సీపీఎం మండిపడింది. కాగా ఎగువ సభలో నామినేటెడ్‌ సభ్యుడు ఒకరు పదవీ విరమణ చేసిన నేపథ్యంలో రాష్ర్టపతి రావ్‌ునాథ్‌ కోవింద్‌ గొగోయ్‌ని ఆ పదవికి నామినేట్‌ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వంటి సున్నిత కేసుల్లో తీర్పులు గొగోయ్‌ నేత్వత్వంలోనే వెలువడిన విషయం తెలిసిందే.

నైతికంగా దిగజారే అవకాశం

గొగోయ్‌ నియామకంపట్ల మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య, రాఫెల్‌ వంటి కేసులలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులనిచ్చినందుకు ఆయనకు ఈ పదవినిచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఇటువంటి పదవులనివ్వడం వల్ల వారు నైతికంగా దిగజారే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గొగోయ్‌ నియామకం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బీ లోకుర్‌, కురైన్‌ జోసెఫ్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఆర్‌ ఎస్‌ సోధీ విమర్శించారు. గొగోయ్‌ని రాజ్యసభకు నామినేట్‌ చేయ డం సరికాదని, క్విడ్‌ ప్రోకో తరహాలో.. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా తీర్పులిస్తే పదవులు దక్కుతాయన్న సందేశాన్ని ఈ చర్యలు తెలుపుతున్నాయని రిటైర్డ్‌ జడ్జి ఏపీ షా పేర్కొన్నారు. 

తర్వాత చెప్తా: గొగోయ్‌

తనను రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై విపక్ష పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో మంగళవారం రంజన్‌ గొగోయ్‌ స్పందించారు. రాజ్యసభ నామినేటెడ్‌ పోస్టును అంగీకరించడానికి గల కారణాల్ని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సవివరంగా వెల్లడిస్తానని చెప్పారు. తాను పార్లమెంటులో ఉండటం వల్ల చట్టం ముందు న్యాయవ్యవస్థ అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


logo