శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 17:11:45

నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ టైంపాస్‌ చేశా.. ఢిల్లీ కరోనా బాధితుడు

నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ టైంపాస్‌ చేశా.. ఢిల్లీ  కరోనా బాధితుడు

‘అది ఐసోలేషన్‌ వార్డు కాదు.. ఓ లగ్జరీ హోటల్‌. అంతకంటే ఎక్కువే. నేను ఐసోలేషన్‌ వార్డులో ఎంత సంతోషంగా ఉన్నా.  రోజూ ప్రశాంతం నెట్‌ఫ్లిక్స్‌లో నాకు నచ్చిన వీడియోలు చూసుకునే వాడిని..’ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఢిల్లీలో కరోనా సోకిన మొదటి వ్యక్తి. ఇప్పడు ఇతను పూర్తిగా కోలుకొని తన కుటుంబసభ్యులతో హాయిగా ఉన్నాడు. పేరు రోహిత్‌ దత్త.

45 యేండ్ల రోహిత్‌ దత్త ఇటలీ వెళ్లి వచ్చాడు. వస్తూ వస్తూ.. కరోనాను ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఇతన్ని వెంటనే గుర్తించిన వైద్యులు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో 14 రోజులు ఉంచి మెరుగైన చికిత్స అందించారు. దీంతో త్వరగా కరోనా నుంచి కోలుకున్నాడు రోహిత్‌దత్త. ఆ తర్వాత ఐసోలేషన్‌వార్డులో తనకు అందిన వైద్య సేవల గురించి మీడియాతో మాట్లాడాడు రోహిత్‌.

‘నేను అక్కడ చికిత్స చేయించుకుంటున్నట్లు లేదు. ఏదో విలాసంగా గడుపుతున్నా అనే ఫీలింగ్‌ కలిగింది. ఎందుకంటే అది ఐసోలేషన్‌ వార్డులా లేదు. ఓ లగ్జరీ హోటల్లా ఉంది. చికిత్స తీసుకునేటప్పుడు ప్రతిరోజూ నేను నా ఫ్యామిలీకి దగ్గరిగానే ఉన్నా. ఎందుకంటే నేను రోజూ వారితో వీడియోకాల్‌ మాట్లాడేది. నాకు అందుతున్న చికిత్స గురించి ప్రతిదీ నా కుటుంబసభ్యులతో షేర్‌ చేసుకున్నా. అంతటి సౌలభ్యం కల్పించారు అధికారులు.  మరీ ముఖ్యంగా నేను నా ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ చూశా.  దీని వల్ల  సమయం ఎలా గడిచిపోయిందో నాకు తెలియలేదు.  ఆస్పత్రి అధికారులు కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు.

 ఇక.. అక్కడ సౌకర్యాలు గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. ప్రతీది హైలెవల్‌లోనే ఉన్నాయి. అది లగ్జరీ హోటల్‌కు ఏమాత్రం తక్కువ కాదు. అక్కడి సిబ్బంది కూడా అధిక స్థాయి పరిశుభ్రతను పాటించారు. నేను ఉండే పరిశరాలన్నీ చాలా శుభ్రంగా ఉంచారు. నేను వాడే దుస్తులు, దుప్పట్లు, ఇతర బెడ్‌షీట్‌లు రోజుకు రెండుసార్లు మార్చి.. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. రోజుకు రెండుసార్లు తప్పకుండా ‘ప్రాణయామం’ చేశా. ‘చాణక్య నీతి’ కూడా చదివాను.  నాలో ఉన్న కరోనా లక్షణాలు చాలా తేలికపాటివని, త్వరలోనే కోలుకుంటావని వైద్యులు ధైర్యం చెప్పేవారు. అలా చెప్పడం వల్ల నా మనసు చాలా తేలికైంది. 

 నాకు మొదట పాజిటివ్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. చనిపోతానేమోనని అనుకున్నా. కానీ వైద్యులు నాలో ధైర్యం నింపారు. ప్రమాదంలో ఉండికూడా నాకు సేవ చేశారు నర్సులు. వారికి కూడా కృతజ్ఞతలు. వారి విధిని వారు చక్కగా నిర్వర్తించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ నాకు ఫోన్‌ చేసి ‘హోలీ’ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా నుంచి నేను కోలుకున్న తర్వాత  కూడా నాకు విషెస్‌ చెప్పారు. నాకోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్‌’ అంటు తన అనుభవాన్ని పంచుకున్నాడు రోహిత్‌ దత్త. కరోనా వస్తే భయపడాల్సి న అవసరం లేదు. మన వైద్యులు మెరుగైన వసతులు కల్పిస్తూ.. రోగులు త్వరగా కోలుకునేలా సేవలు అందిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు గాంధీలో మెరుగైన చికిత్స పొంది.. కరోనాను జయించాడు.


logo