మంగళవారం 31 మార్చి 2020
National - Mar 16, 2020 , 04:31:22

మహారాష్ట్రపై పంజా

మహారాష్ట్రపై  పంజా

న్యూఢిల్లీ,  మార్చి 15: మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. ఆదివారం ఒక్కరోజే 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 32కి చేరుకున్నది. మరోవైపు, భారత్‌లో మొత్తం బాధితుల సంఖ్య 110కి చేరుకున్నది. కరోనా కాటుకు దేశంలో ఇప్పటికే ఇద్దరు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఢిల్లీలో 7, ఉత్తరప్రదేశ్‌-12, కర్ణాటక-6, మహారాష్ట్ర- 32, లడఖ్‌-3, జమ్ముకశ్మీర్‌- 2, తెలంగాణ- 3, రాజస్థాన్‌-4, కేరళ-22, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరా ఖండ్‌ల్లో ఒక్కొక్కరికి చొప్పున కరోనా సోకినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. బాధితుల్లో 17మంది విదేశీయులు.


ముంబైలో ఆంక్షలు

ఈ నెలాఖరు వరకు గ్రూప్‌ టూర్లను నిరోధించేందుకు ముంబై పోలీసులు సెక్షన్‌ 144ను విధించారు. పుణెలోనూ 144 సెక్షన్‌ను విధించనున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో తమిళనాడులో ప్రాథమిక బడులను మూసివేయడంతోపాటు, కేరళ సరిహద్దు జిల్లాల్లో థియేటర్లు, మాల్స్‌ను సైతం మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసోం, ఉత్తరాఖండ్‌, హర్యానాలో విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌ను మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి. కరోనా నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారించాలని కలకత్తా హైకోర్టు, గౌహతి హైకోర్టు నిర్ణయించాయి. 


ఇటలీ, ఇరాన్‌ నుంచి స్వదేశానికి..

ఇటలీ, ఇరాన్‌లలో చిక్కుకుపోయిన 450 మందికిపైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్వదేశానికి తీసుకొచ్చింది. ఇటలీనుంచి తీసుకొచ్చిన 218 మంది ప్రయాణికులను నైరుతి ఢిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్‌కు తరలించారు. ఇరాన్‌ నుంచి తీసుకొచ్చిన 230 మందికిపైగా ప్రయాణికులను జైసల్మీర్‌లోని ఆర్మీ వెల్‌నెస్‌ సెంటర్‌కు తరలించారు. 


కర్తార్‌పూర్‌ యాత్ర బంద్‌

కరోనా ముప్పు నేపథ్యంలో పాక్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా యాత్రను ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే పాకిస్థాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణికుల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏసీ బోగీల్లో బ్లాంకెట్లు, కర్టెన్లను ఉపసంహరించుకోవాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీచేసింది. అలాగే ఆ బోగీల్లో కనిష్ట ఉష్ణోగ్రతను 24 డిగ్రీలుగా ఉంచాలని స్పష్టంచేసింది. 


  • ఒక్కరోజే 13 కొత్త కేసులు
  • దేశంలో 110కి పెరిగిన బాధితులు
  • ముంబైలో 144 సెక్షన్‌


logo
>>>>>>