శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 03:19:23

కరోనా తొలి కాటు

కరోనా తొలి కాటు
  • వైరస్‌ సోకి 76 ఏండ్ల కర్ణాటకవాసి మృతి
  • మరణానికి ముందు హైదరాబాద్‌కు వచ్చిన బాధితుడు
  • దేశంలో 74కు చేరిన కొవిడ్‌-19 కేసులు
  • వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు రెండేండ్లు పట్టొచ్చు: కేంద్రం
  • కరోనా నియంత్రించదగిన మహమ్మారి: డబ్లూహెచ్‌వో

న్యూఢిల్లీ, మార్చి 12: ప్రాణాంతక కరోనా(కొవిడ్‌-19) మహమ్మారి భారత్‌లో ఒకరిని బలితీసుకున్నది. కర్ణాటకలో ఇటీవల చనిపోయిన 76 ఏండ్ల వృద్ధుడు కరోనా బాధితుడని అధికారులు తెలిపారు. దేశంలో ఈ వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య గురువారంనాటికి 74కు చేరింది. కరోనా వైరస్‌ ‘ఓ నియంత్రించదగిన మహమ్మారి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) పేర్కొంది.  


కర్ణాటకలో కరోనా మృతి  

దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76 ఏండ్ల ఓ వృద్ధుడు మంగళవారం చనిపోయాడు. అయితే,   అతనికి కరోనా సోకినట్టు ఆ రాష్ట్ర అధికారులు గురు0వారం ధ్రువీకరించారు. కాగా మృతుడు మరణించడాని కంటే ముందు హైదరాబాద్‌లోని  రెండు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.  మరోవైపు, వృద్ధుడు చికిత్స తీసుకున్న దవాఖానల్లోని సిబ్బందిని పర్యవేక్షణలో ఉంచామని, ఇప్పటి వరకూ ఎవ్వరికీ వైరస్‌ సోకినట్టు గుర్తించలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ జి శ్రీనివాసరావు తెలిపారు.  మృతిచెందిన వృద్ధుడితో 43 మంది కాంటాక్ట్‌లో ఉన్నట్టు తేలింది. తొలి కరోనా మరణానికి హెదరాబాద్‌తో సంబంధం ఉన్నట్టు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని దవాఖానల్ని అప్రమత్తం చేసింది.   కాగా  వృద్ధుడు  సౌదీ అరేబియా నుంచి గతనెల 29న దేశానికి వచ్చినట్టు అధికారులు పేర్కొనారు. మరోవైపు, కరోనా వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 74కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకూ ఢిల్లీ-6, ఉత్తర్‌ప్రదేశ్‌-10, కర్ణాటక-4, మహారాష్ట్ర-11, లఢక్‌-3, రాజస్థాన్‌, తెలంగాణ, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదవ్వగా.. కేరళలో ఇప్పటివరకూ 17 కరోనా కేసులు నమోదయ్యాయని ఇందులో ముగ్గురు వ్యక్తులు కోలుకోవడంతో వాళ్లను డిశ్చార్జి చేశామని ఆ శాఖ తెలిపింది. మరోవైపు, కరోనాను నియంత్రించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ఈ వైరస్‌ ‘ఓ నియంత్రించదగిన మహమ్మారి’ అని డబ్లూహెచ్‌వో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లోని 1,26,000మందికి కరోనా సోకిందని వెల్లడించింది. ఇటలీలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. గురువారం 189 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,016కు పెరిగింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 429గా నమోదైంది. ఇంకోవైపు, కరోనా కారణంగా  ఐరోపా-రష్యా దేశాలు తమ మార్స్‌ ప్రయోగాన్ని రెండేండ్లు వాయిదా వేసకున్నాయి.


నిర్థారణ కాలేదు

కరోనా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కనీసం రెండేండ్ల సమయం పడుతుందని కేంద్రం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వైరస్‌లు సాధారణంగా జీవించలేవని అయితే కరోనా విషయంలో ఇది ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో  ఇంటివద్ద నుంచే పనిచేయాలని ట్విట్టర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను ఆదేశించింది. 


భయం వద్దు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలందరూ భయాన్ని విడిచిపెట్టి.. ముందు జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ప్రజలు అనవసరమైన విదేశీ ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను అరికట్టేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రులు ఎవరూ కూడా కొన్ని రోజుల పాటు విదేశీ ప్రయాణాలు చేయరని మోదీ పేర్కొన్నారు. ప్రజలేవరూ గుమిగూడవద్దని, దీంతో వైరస్‌ను అరికట్టొచ్చన్నారు.


కరోనా కట్టడికి వ్యాక్సిన్‌

కరోనాను అరికట్టేందుకు ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు  వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు ఆ దేశ మీడియాలో గురువారం కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. మరికొద్ది రోజుల్లో దీనిపై వాళ్లు ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం.


logo