గురువారం 09 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 03:42:08

సరికొత్త చరిత్ర!

సరికొత్త చరిత్ర!
  • ట్రంప్‌ పర్యటనతో నూతన అధ్యాయం
  • భారత్‌కు ట్రంప్‌ ‘ప్రత్యేక మిత్రుడు’
  • ఇండియా, అమెరికా సహజ భాగస్వాములు
  • నవభారత్‌లో అగ్రరాజ్యానికి అపార అవకాశాలు
  • ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు ‘ప్రత్యేక మిత్రుడ’ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. భారత్‌, అమెరికా ‘సహజ భాగస్వాము’లని చెప్పారు. ట్రంప్‌ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘సరికొత్త చరిత్ర’ను సృష్టించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మోతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. నూతన దశాబ్దం మొదలైన వేళ, అధ్యక్షుడు ట్రంప్‌ లాంటి ప్రత్యేక నాయకుడు, ప్రత్యేక మిత్రుడు భారత పర్యటనకు రావడం గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ‘పునరుత్తేజం పొందిన అమెరికా’కు ‘నవభారత్‌' అనేక నూతన అవకాశాలను కల్పిస్తున్నదని చెప్పారు. భారత్‌, అమెరికా చారిత్రక సంబంధాల్లో ట్రంప్‌ పర్యటన సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. రెండు దేశాల మధ్య  బంధం కేవలం భాగస్వామం మాత్రమే కాదని, అంతకంటే గొప్ప, సుదృఢమైన సంబంధం అని వ్యాఖ్యానించారు. సరికొత్త చరిత్ర ఆరంభమవుతున్నదని, కొత్త కూటములు, సవాళ్లు, అవకాశాలు, మార్పులకు పునాది పడుతున్నదన్నారు. 21వ శతాబ్దంలో ప్రపంచ రూపురేఖలను నిర్ణయించడంలో భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు, సహకారం కీలకం కానున్నదని చెప్పారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారత సైన్యం అమెరికాతో కలిసి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. 

సరికొత్త శిఖరాలకు సంబంధాలు..

‘ఈ దశాబ్దంలో నవభారత్‌.. అమెరికాకు అనేక అవకాశాలను కల్పిస్తున్నది. ప్రతి అభివృద్ధి అంశంలోనూ రెండు దేశాలూ గణనీయంగా లబ్ధిపొందే వీలుంది. భారత్‌లో తయారీని పెంచడం, మౌలిక వసతులను పెంపొందించడం ద్వారా అమెరికాకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ ‘ఇండస్ట్రీ 4.0’ యుగంలో భారత డిజిటల్‌ ఎకానమీని విస్తృత పరుచడం ద్వారా పెట్టుబడులకు అమెరికాకు అపార అవకాశాలు లభించనున్నాయి’ అని మోదీ వివరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయని, కుటుంబంతో కలిసి ట్రంప్‌ భారత పర్యటనకు రావడమే ఇందుకు నిదర్శనమని ప్రధాని తెలిపారు. ‘మన ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయి. మన ఆర్థిక భాగస్వామ్యం విస్తృతమవుతుంది. మన డిజిటల్‌ సహకారం మరింత పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయమని.. భారత్‌, అమెరికా ప్రజల అభ్యున్నతి, సుసంపన్నతకు ఇది తార్కాణంగా నిలుస్తుందని చెప్పారు. గత కొన్నేండ్లలో భారత్‌, అమెరికా మధ్య విశ్వాసం మరింత బలపడిందని, నేడు అది చారిత్రక స్థాయికి చేరుకున్నదన్నారు.  

కలిసికట్టుగా నవభారత నిర్మాణం..

నేడు 130 కోట్ల మంది భారతీయులు కలిసికట్టుగా నవభారతాన్ని నిర్మిస్తున్నారని ప్రధాని చెప్పారు. ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించిందని, అలాగే వేగవంతంగా ఆర్థిక సేవలను ప్రజలందరికీ చేరువ చేస్తుండడం ద్వారా మరో రికార్డు సాధిస్తున్నదని పేర్కొన్నారు. నేడు భారత్‌ విస్తృత పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యం ఏర్పరుచుకున్న దేశం అమెరికానేని తెలిపారు. కేవలం ఇండోపసిఫిక్‌ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచ శాంతి, పురోగతి, భద్రతకు కూడా భారత్‌కు పాటుపడగలదని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 


logo