గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 03:18:01

నేడు భారత్‌కు శ్వేతసౌధాధిపతి

నేడు భారత్‌కు శ్వేతసౌధాధిపతి
  • ఉదయం 11.40 గంటలకు చేరుకోనున్న ట్రంప్‌ దంపతులు
  • భారత్‌లో రెండు రోజులపాటు పర్యటన
  • ఘన స్వాగతానికి అహ్మదాబాద్‌ నగరం ముస్తాబు
  • మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ట్రంప్‌ ఆదివారం భారత్‌కు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉదయం 11.40 గంటలకు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్రంప్‌ దంపతులను స్వాగతించనున్నారు. అనంతరం అశేష జనవాహిని మధ్య 22 కి.మీ. మేర సాగే భారీ రోడ్‌షోలో ఇరువురు నేతలు పాల్గొంటారు. మార్గమధ్యంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమానికి హాజరవుతారు. సుమారు 1.10 లక్షలమంది సభికులను ఉద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించనున్నారు.  గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి మోదీతోపాటు ట్రంప్‌ హాజరైన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి భారత్‌కు వస్తున్నారు. ట్రంప్‌ పరివారం ఆదివారం అమెరికా నుంచి బయలుదేరింది. సోమవారం ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. వారికి ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. 


మెగా ఇండియా రోడ్‌ షో..

అగ్రనేతల రాక నేపథ్యంలో అహ్మదాబాద్‌ అధికారులు, భద్రతా సిబ్బంది తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. అహ్మదాబాద్‌ స్టేడియం నుంచి సుమారు 22 కి.మీ. మేర రోడ్‌ షో సాగనుంది. దాదాపు లక్షమంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ట్రంప్‌కు స్వాగతం పలుకనున్నారని అధికారులు తెలిపారు. దీనికి ‘ఇండియా రోడ్‌ షో’గా నామకరణం చేశారు. రోడ్‌షో సందర్భంగా వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మోతెరా స్టేడియంలో నిర్వహించనున్న ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో మోదీ, ట్రంప్‌ పాల్గొంటారు. దీనికి లక్షమందికిపైగా హాజరవుతారని అంచనా.


మనతో ఉండడం గౌరవ కారణం: మోదీ

ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు భారత్‌ ఎదురు చూస్తున్నదని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అహ్మదాబాద్‌లో జరిగే చారిత్రక కార్యక్రమం మొదలుకొని ఆయన సోమవారం మనతో ఉండడం గౌరవమని పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్‌ అంటూ యావత్‌ గుజరాత్‌ ముక్తకంఠంతో నినదిస్తున్నది’ అని గుజరాత్‌ సీఎం రూపానీ చేసిన ట్వీట్‌ను మోదీ రీట్వీట్‌ చేశారు. 


భారత్‌ బయల్దేరిన ట్రంప్‌

ట్రంప్‌ పరివారం ఆదివారం భారత్‌కు పయనమైంది. సోమవారం ఉదయం 11.40 గంటలకు వారు అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. భారత్‌కు బయల్దేరే ముందు ట్రంప్‌ మాట్లాడుతూ.. చాలా కాలం కిందటే తాను భారత్‌కు వెళ్లాలని అనుకున్నానని చెప్పారు. ‘భారత ప్రజలను కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రధాని మోదీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉన్నది. ఆయన నాకు స్నేహితుడు’ అని పేర్కొన్నారు. ‘భారత్‌లో అతిపెద్ద కార్యక్రమం జరుగనున్నది. భారత్‌లో ఇదే అతిపెద్ద కార్యక్రమమని ప్రధాని మోదీ చెప్పారు. అందులో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రంప్‌ పేర్కొన్నారు. 



ట్రంప్‌కు స్వాగతం పలుకనున్న సీఎం యోగి

ట్రంప్‌ తాజ్‌మహాల్‌ సందర్శన సందర్భంగా ఆగ్రా ఎయిర్‌పోర్టు వద్ద యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు. అయితే తాజ్‌మహల్‌ సందర్శనలో వారు ట్రంప్‌ వెంట ఉండబోరన్నారు. రాష్ట్రపతి కోవింద్‌ ఈ నెల 25న ట్రంప్‌ గౌరవార్థం ఇచ్చే ఆతిథ్యానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాబ్‌ నబీ ఆజాద్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌చౌదరికి ఆహ్వానం అందింది. అయితే సోనియా గాంధీని ఆహ్వానించకపోవడంతో తాను హాజరుకాబోనని అధిర్‌ తెలిపారు. మరోవైపు మెలానియా ఢిల్లీలోని పాఠశాల సందర్శనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా హాజరైనా తమకు అభ్యంత రం లేదని అమెరికా ఎంబసీ తెలిపింది. 


36 గంటలు బిజీబిజీ..


ఫిబ్రవరి 24

ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విమానాశ్రయంలో ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు. అనంతరం అహ్మదాబాద్‌ వీధుల్లో భారీ జనసందోహం నడుమ సుమారు 22 కి.మీ. మేర రోడ్‌షో సాగనుంది. మార్గమధ్యంలో కొంతసేపు సబర్మతి ఆశ్రమం వద్ద ఆగి, జాతిపిత గాంధీజీకి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా రాట్నం, గాంధీజీ జీవితానికి సంబంధించిన పుస్తకాలు, బాపూజీ ప్రతిమను ట్రంప్‌కు మోదీ బహూకరిస్తారు. 

అనంతరం 12.30 గంటలకు ఇరువురు నేతలు మోతేరా స్టేడియానికి చేరుకుని ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సుమారు 1.10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. పలువురు బాలీవుడ్‌ తారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

మధ్యాహ్నం ప్రధాని ఇచ్చే విందుకు ట్రంప్‌ దంపతులు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆగ్రాకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు తాజ్‌మహల్‌కు చేరుకుంటారు. సుమారు 45 నిమిషాలపాటు అక్కడ గడుపనున్నారు. అనంతరం వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 


ఫిబ్రవరి 25

ఉదయం పది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కోవింద్‌ దంపతులు ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలుకుతారు. 

10.45 గంటలకు ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీజీకి నివాళులర్పిస్తారు.  11.30 గంటలకు హైదరాబాద్‌ హౌజ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీతో ట్రంప్‌ భేటీ అవుతారు. అదే సమయంలో, మెలానియా  ఢిల్లీలోని పాఠశాలను సందర్శిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు అమెరికా ఎంబసీలో నిర్వహించే సీఈవోల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భారతీయ పారిశ్రామికవేత్తలను ట్రంప్‌ కలుస్తారు.

రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు ట్రంప్‌ దంపతులు హాజరవుతారు. అనంతరం రాత్రి 10 గంటలకు తిరిగి అమెరికా బయలుదేరి వెళ్తారు. 


గానా బజానా..

ట్రంప్‌ పర్యటన సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. రోడ్‌ షోతోపాటు మోతెరా స్టేడియం వద్ద వీటిని ప్రదర్శించనున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన నృత్యకారులు, గాయకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే 28 రాష్ర్టాలకు చెందిన కళాకారుల ప్రదర్శన కోసం రోడ్‌ షో వెంట వేదికలు ఏర్పాటు చేశారు. గుజరాత్‌ సంప్రదాయ నృత్యం ‘గార్బా’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మోతెరా స్టేడియం వద్ద బాలీవుడ్‌ గాయకులు పాటలు పాడనున్నారు. వీరిలో కైలాశ్‌ ఖేర్‌, పార్థివ్‌ గోహిల్‌, గుజరాతీ జానపద గాయకులు కిర్తిదన్‌ గాద్వి, గీతా రబారీ, పురుషోత్తం ఉపాధ్యాయ్‌, సాయిరాం దేవ్‌ ఉన్నారు. 


భద్రతా వలయంలో అహ్మదాబాద్‌

ట్రంప్‌ రాక నేపథ్యంలో అహ్మదాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వేలకు పైగా పోలీసులను మోహరించారు. వీరికి 25 మంది ఐపీఎస్‌ అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది, జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) సిబ్బంది, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సిబ్బంది కూడా భద్రతా విధుల్లో పాల్గొంటారు. అలాగే డ్రోన్‌లపై నిఘా ఉంచడానికి, అనుమానిత డ్రోన్‌లను నిర్వీర్యం చేయడానికి యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ (డ్రోన్లను నిర్వీర్యం చేసే సాంకేతిక పరిజ్ఞానం)ని కూడా ఉపయోగిస్తున్నారు. రోడ్‌ షో వెంట ఎన్‌ఎస్‌జీకీ చెందిన స్నిప్పర్‌ బృందం కూడా ఉండనున్నది. 



భారత్‌ పర్యటనపట్ల ఇవాంకా హర్షం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారురాలు ఇవాంకా ట్రంప్‌ కూడా ఆయన వెంట భారత్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మోదీతో కలిసి పాల్గొన్నాను. ప్రపంచంలోని రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న గొప్ప స్నేహాన్ని వేడుకగా జరుపుకునేందుకు రెండేండ్ల తర్వాత కుటుంబంతో కలిసి తిరిగి భారత్‌కు రానుండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.



ట్రంప్‌ @ 7


భారత్‌లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్‌ ఏడవ అధ్యక్షుడిగా నిలువనున్నారు. గతంలో భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షలు వీరే..


1. డ్వైట్‌ డి.ఐసన్‌హోవర్‌ (1959 డిసెంబర్‌ 9-14 )

భారత్‌లో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ డి.ఐసన్‌హోవర్‌. ఆయన జరిపిన చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి పునాది వేసింది. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌, ప్రధాని నెహ్రూతో ఆయన సమావేశమయ్యారు. రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాజ్‌మహాల్‌ను సందర్శించారు.


2. రిచర్డ్‌ నిక్సన్‌ (1969 జూలై 31-ఆగస్టు1)

ఇందిరా గాంధీ హయాంలో భారత్‌లో పర్యటించిన రిచర్డ్‌ నిక్సన్‌, కొన్ని గంటలపాటు మాత్రమే ఉన్నారు. బంగ్లాదేశ్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ వైపు మొగ్గుచూపడంతో ఆయన పర్యటనపట్ల భారత్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు.


3. జిమ్మీ కార్టర్‌ (1978 జనవరి 1-3) 

ఎమర్జెన్సీ అనంతరం ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే జిమ్మీ కార్టర్‌ భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధం, 1974లో అణు పరీక్షల నేపథ్యంలో దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణ లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ఢిల్లీ సమీప గ్రామాన్ని సందర్శించగా అనంతరం ఆ గ్రామానికి ఆయన పేరుపెట్టారు. 


4. బిల్‌ క్లింటన్‌ (2000 మార్చి 19-25)

జిమ్మీ కార్టర్‌ తర్వాత సుమారు 20 ఏండ్లకుపైగా అమెరికా అధ్యక్షులెవరూ భారత్‌లో పర్యటించలేదు. 2000లో బిల్‌ క్లింటన్‌ భారత్‌కు వచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో అణు పరీక్షలు జరుపడం, కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించిన పరిణామాలతో భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించిన తరుణంలో క్లింటన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక , ఆర్థిక భాగస్వామ్యానికి ఆయన పర్యటన దోహదపడింది. ఇంధనం, పర్యావరణం అంశాల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేశారు. తాజ్‌మహల్‌తోపాటు జైపూర్‌, హైదరాబాద్‌, ముంబై వంటి ప్రముఖ ప్రాంతాలనూ సందర్శించారు. 


5. జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ (2006 మార్చి 1-3)

ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలో యూపీఏ తొలి ప్రభుత్వం కొలువైన వేళ, భార్య లారా బుష్‌తో కలిసి జార్జ్‌ బుష్‌ భారత్‌ను సందర్శించారు. ఢిల్లీలోని పురానా ఖిలాలో కొద్ది మంది ప్రముఖులనుద్దేశించి ప్రసంగించారు. అణు ఒప్పందం ఖరారుకు ఆయన పర్యటన దోహదపడింది.


6. బరాక్‌ ఒబామా (2010 నవంబర్‌ 6-9, 2015 జనవరి 24-27)

రెండుసార్లు భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రికార్డు సృష్టించారు. గత అధ్యక్షులకు భిన్నంగా తొలి పర్యటన సాగింది. ఉగ్రదాడితో తల్లడిల్లిన ముంబైలో అడుగుపెట్టి బాధితులకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. భారీ వాణిజ్య బృందంతో వచ్చిన ఆయన అమెరికా ఇండియా పారిశ్రామిక సదస్సులో ప్రసంగించారు. ఐరాస భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చారు. భార్య మిచెల్‌ ఒబామా ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిరుపేద పిల్లలతో కలిసి డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2015లోనూ భార్యతో కలిసి ఒబామా భారత్‌లో మరోసారి పర్యటించారు. గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌, మోదీతో పలు అంశాలపై చర్చలు జరిపారు. 


logo