మంగళవారం 31 మార్చి 2020
National - Feb 22, 2020 , 01:54:24

గ్రెటాకు అరుదైన గౌరవం

గ్రెటాకు అరుదైన గౌరవం
  • నత్తల్లో కొత్త జాతికి పర్యావరణ ఉద్యమకారిణి పేరు

లండన్‌, ఫిబ్రవరి 21: యువ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అరుదైన గౌరవం లభించింది. నత్తల్లో కొత్త జాతికి ఆమె పేరు పెడుతూ నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తున్న గ్రెటా థన్‌బర్గ్‌ పేరు కలిసి వచ్చేలా వీటికి ‘క్రాస్పిడోట్రోపిస్‌ గ్రెటాథన్‌బర్గ్‌' అని పేరు పెట్టినట్టు వాళ్లు పేర్కొన్నారు. మారుతున్న ఉష్ణోగ్రతలకు ఈ జాతికి చెందిన జీవులు త్వరగా ప్రభావితం అవుతాయని.. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతల్లో తీవ్రత, అడవుల క్షీణత వంటి విపత్కర పరిణామాలకు త్వరగా లోనవుతాయని, ఇవి నత్తల్లో ‘క్యానోగ్యాస్ట్రోపోడ్స్‌' వర్గానికి చెందిన కొత్త జాతి జీవులని తెలిపారు. ఈ వివరాలు ‘బయోడైవర్సిటీ డాటా’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ నత్త జాతిని బ్రూనైలోని కువాలా పరిశోధన కేంద్రానికి అతి సమీపంలో కనుగొన్నట్టు మెన్నో షిల్తుయిజెన్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. పర్వత వాలు ప్రాంతాల్లో, నదీ తీరాల్లో, రాత్రి వేళల్లో ఆకుపచ్చని మొక్కల కింది భాగాల్లో ఈ జీవులు సంచరిస్తాయని ఆయన తెలిపారు. కొత్తరకం జాతికి తన పేరు పెట్టడంపై థన్‌బర్గ్‌ హర్షం వ్యక్తం చేశారని, పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె జరుపుతున్న పోరాటంలో అందరూ భాగస్థులు కావాలని మరో శాస్త్రవేత్త జేపీ లిమ్‌ తెలిపారు.


logo
>>>>>>