బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 03:13:54

నిరసన తెలుపండి.. కానీ.. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు

నిరసన తెలుపండి.. కానీ.. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో చేపడుతున్న నిరసనలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక హక్కు. అయితే రోజుల తరబడి రోడ్లను ఆక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. ఈ విషయంలో సమతూకం అవసరం. ప్రజలు రోడ్లపై నిరసనలు తెలుపడం మొదలెడితే ఏం జరుగుతుందో ఆలోచించండి. అభిప్రాయాలను వ్యక్తీకరించడం ద్వారానే ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. కానీ, అందుకు కొన్ని హద్దులు కూడా ఉంటాయి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో గత రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. షాహీన్‌బాగ్‌ రోడ్లపై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించి ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని, వారు ఇతర ప్రాంతానికి వెళ్లేలా చర్చలు జరుపాలని దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా షాహీన్‌బాగ్‌ నిరసనకారులతో మాట్లాడేందుకు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే, సాధన రామచంద్రన్‌ను మధ్యవర్తులుగా సుప్రీంకోర్టు నియమించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగనిచోట నిరసన తెలిపేలా నిరసనకారులను ఒప్పించాలని సూచించింది. ఒకవేళ ఫలితం కనిపించనిపక్షంలో నిర్ణయాధికారం అధికారులకే వదిలేస్తామని ధర్మాసనం పేర్కొన్నది.


logo
>>>>>>