సోమవారం 30 మార్చి 2020
National - Feb 18, 2020 , 01:57:12

పర్యావరణానికి హాని లేని అభివృద్ధి

పర్యావరణానికి హాని లేని అభివృద్ధి
  • వలస వచ్చే వన్యప్రాణుల పరిరక్షణలో పరస్పర సహకారం
  • కాప్‌ సదస్సునుద్దేశించి ప్రధాని మోదీ ఉద్ఘాటన

న్యూఢిల్లీ/గాంధీనగర్‌: తమ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు. పారిస్‌ వాతావరణ ఒప్పందానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అతికొద్ది దేశాలలో భారత్‌ కూడా ఒకటని తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సోమవారం వలస జాతుల వన్యప్రాణుల పరిరక్షణపై కాప్‌ (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌) 13వ సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానం, హరిత అభివృద్ధి వంటి విలువల ఆధారంగా వాతావరణ మార్పుల సవాళ్లను భారత్‌ ఎదుర్కొంటున్నదని చెప్పారు. వలస వచ్చే వన్యమృగాలు లేక పక్షులు ఖండాలను అనుసంధానం చేస్తాయని, అందరూ కలిసి వాటిని ఆహ్వానించాలన్నారు. భారత్‌లోని అనేక రక్షిత ప్రాంతాలు ఇతర దేశాల సరిహద్దులతో కలిసి ఉన్నాయని, ఆయా ప్రాంతాలలో వన్యజీవుల పరిరక్షణలో పరస్పర సహకారం వల్ల సానుకూల ఫలితాలు వెలువడవచ్చని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  logo