శనివారం 06 జూన్ 2020
National - May 20, 2020 , 00:46:01

జూన్‌ 1 నుంచి రైలు కూత

జూన్‌ 1 నుంచి రైలు కూత

  • 200 నాన్‌-ఏసీ రైళ్లను నడుపుతాం: రైల్వే శాఖ
  • చిన్న పట్టణాల్లోని ప్రజలకు ఊరట

న్యూఢిల్లీ, మే 19: దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న వారికి భారతీయ రైల్వే ఊరట కలిగించింది. వచ్చే నెల ఒకటి నుంచి 200 ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లను నడుపబోతున్నట్టు ప్రకటించింది. నాన్‌-ఏసీ, రెండో తరగతి కోచ్‌లు గల ఈ రైళ్లను రోజూ నడుపబోతున్నట్టు వివరించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. టికెట్‌ ధరలు కూడా సాధారణ స్టీపర్‌ క్లాసు ధరలే ఉంటాయని వెల్లడించింది. ఈమేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. అయితే, ఏయే నగరాలను కలుపుతూ ఈ రైళ్లను నడుపబోతున్నారన్న విషయాన్ని మంత్రి వెల్లడించలేదు. అయితే, చిన్న పట్టణాలు, నగరాలను కలుపుతూ  రైళ్లను నడుపబోతున్నట్టు  రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి.  శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో వెళ్లలేకపోయిన వలస కార్మికుల జాబితాల్ని అందిస్తే ప్రత్యేక రెళ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తామని ఆయా రాష్ర్టాలకు రైల్వే శాఖ మరో ప్రకటనలో సూచించింది. వచ్చే రెండు రోజుల్లో శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించింది. రోజుకు 400 చొప్పున శ్రామిక్‌ రెళ్లను నడుపనున్నట్టు వివరించింది.

శ్రామిక్‌ రైళ్లపై.. రైల్వేశాఖదే నిర్ణయం

ఇకపై శ్రామిక్‌ రైళ్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలు రైల్వే శాఖే తీసుకుంటుంది. వలస కార్మికుల తరలింపునకు తగినన్ని ప్రత్యేక రైళ్లు నడపడం, రైళ్లు ఆగే స్టేషన్ల సంఖ్యను పెంచడం, రాష్ర్టాలతో సంప్రదించి టికెట్ల బుకింగ్‌, స్టేషన్ల వద్ద స్క్రీనింగ్‌వంటివన్నీ రైల్వేనే చూసుకుంటుంది. కేంద్ర హోం శాఖతో సంప్రదించిన తర్వాతే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతిస్తుంది. వలస కార్మికుల ప్రయాణాలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను కేంద్రం మంగళవారం జారీ చేసింది. 


logo