సోమవారం 06 జూలై 2020
National - Jun 18, 2020 , 11:56:27

4 బొగ్గు ప్రాజెక్టుల‌పై 20వేల కోట్ల పెట్టుబ‌డి : మోదీ

4 బొగ్గు ప్రాజెక్టుల‌పై 20వేల కోట్ల పెట్టుబ‌డి : మోదీ

హైద‌రాబాద్‌: దేశంలోని 41 బొగ్గు గ‌నులను క‌మ‌ర్షియ‌ల్ మైనింగ్ కోసం ప్ర‌ధాని మోదీ ఇవాళ వేలం వేశారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ ప‌థ‌కంలో భాగంగా బొగ్గు గ‌నుల వేలం ప్ర‌క్రియ మొద‌లైంది.  ప్రైవేటు భాగ‌స్వామ్యంతో బొగ్గు అమ్మ‌కాలు చేప‌ట్ట‌నున్నారు.  ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్‌19 సంక్షోభాన్ని.. భార‌త్ ఓ అవ‌కాశంగా మ‌లుచుకుంటోంద‌ని మోదీ అన్నారు. కోవిడ్ మ‌న‌కు స్వాలంభ‌న నేర్పింద‌న్నారు. దిగుమ‌తుల‌పై త‌క్కువ‌గా ఆధార‌ప‌డాల‌న్న పాఠం క‌రోనా సంక్షోభం నేర్పింద‌న్నారు. ఎన‌ర్జీ సెక్టార్‌లో భార‌త్‌ను స్వ‌యం స‌మృద్ధి చేసేందుకు ఈ భారీ ప్ర‌య‌త్నం చేప‌ట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. 

ద‌శాబ్ధాలుగా భార‌త బొగ్గు ప‌రిశ్ర‌మ‌ల రంగం ఓ ఊబిలో కూరుకుపోయింద‌న్నారు. ఇన్నాళ్లూ పోటీకి దూరంగా ఆ రంగం ఉండిపోయింద‌న్నారు. పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని విమ‌ర్శించారు. కానీ 2014 త‌ర్వాత అనేక చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. తాము తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్లే బొగ్గు ప‌రిశ్ర‌మ బ‌లోపేతం అయ్యింద‌న్నారు.  2030 క‌ల్లా సుమారు వంద మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును వాయువుగా మార్చేందుకు టార్గెట్ పెట్టుకున్న‌ట్లు ఆయన తెలిపారు. దీని కోసం నాలుగు ప్రాజెక్టుల‌ను గుర్తించిన‌ట్లు మోదీ చెప్పారు. ఆ ప్రాజెక్టుల కోసం సుమారు 20 వేల కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

బొగ్గు ఉత్ప‌త్తి ద్వారా వ‌చ్చే అద‌న‌పు ఆదాయాన్ని.. ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం ఆ ప్రాంతంలోనే ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. జిల్లా ఖ‌నిజ నిధి నుంచి రాష్ట్రాల‌కు స‌హాయం అందుతుంద‌ని, బొగ్గు ప‌రిశ్ర‌మ‌లు ఉన్న ప్రాంతాల వ‌ద్ద అద‌న‌పు అవ‌స‌రాల ఏర్పాటు కోసం ఆ నిధుల‌ను వాడ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  బొగ్గు తీసిన క్ష‌ణం నుంచి దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు కావాల్సిన అన్ని ఆధునిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ప్రాంతీయ ప్ర‌జ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు, అద‌న‌పు వ‌స‌తుల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు.  బొగ్గు ప‌రిశ్ర‌మంలో చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌లు.. గిరిజ‌న బ్ర‌తుకుల్ని మార్చేస్తాయ‌ని, తూర్పు, మ‌ధ్య భార‌త‌దేశం కూడా అభివృద్ధిలో భాగ‌స్వామలు అవుతాయ‌న్నారు.  logo