సోమవారం 01 జూన్ 2020
National - May 13, 2020 , 02:02:11

రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ

రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ

  • భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • దేశ జీడీపీలో ప్యాకేజీ విలువ 10శాతం
  • నేటి నుంచి ఆర్థిక ప్యాకేజీ వివరాల వెల్లడి 
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో ప్రచారం
  • భారత్‌ స్వయం ప్రకాశమే లక్ష్యం
  • కరోనా సంక్షోభమే మనకు సందేశం
  • కొత్తరూపంలో నాలుగో లాక్‌డౌన్‌
  • ప్రాణాలు కాపాడుతూనే ప్రగతి పథంలో
  • దేశ ప్రజలకు ప్రధాని మోదీ సందేశం 

ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మన భూమి, శ్రమ, ద్రవ్య లభ్యత, చట్టాలకు బలాన్నిఇస్తుంది. కూలీలు, రైతులు, నిజాయితీగా పన్నుచెల్లించేవారు, సూక్ష్మచిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమల అవసరాలు తీరుస్తుంది. 

న్యూఢిల్లీ, మే 12: కరోనాపై పోరులో కునారిల్లిన భారత ఆర్థికవ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. కార్పొరేట్‌రంగం నుంచి రైతన్నల వరకు, చిన్న పరిశ్రమల నుంచి వలస కూలీవరకు ప్రతి ఒక్కరూ తిరిగి పుంజుకొనేందుకు అవసరమైన శక్తిని ఈ ప్యాకేజీ ఇస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మంగళవారం రాత్రి టీవీలో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని, దేశ స్వయం ప్రకాశమే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంటుందని పేర్కొన్నారు. దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ 10శాతమని వివరించారు. ప్యాకేజీ పూర్తివివరాలను ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం నుంచి దశలవారీగా ప్రకటిస్తారని తెలిపారు. దేశంలో మూడోవిడత లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగుస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత మొదలయ్యే లాక్‌డౌన్‌ 4.0 పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నదని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా

కరోనాపై పోరులో భారత్‌ అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. కనీవినీ ఎరుగని ఈ సంక్షోభమే భారత అభివృద్ధికి గొప్ప సందేశం ఇచ్చిందన్నారు. ఈ సంక్షోభం నుంచే మనం గొప్ప అవకాశాలను సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. ‘కరోనా సంక్షోభం మొదలైనప్పుడు మనం ఒక్క పీపీఈ కిట్‌ను కూడా ఉత్పత్తి చేయటంలేదు. ఎన్‌-95 మాస్కులు అతి తక్కువగా తయారు చేస్తున్నాం. కానీ ఇప్పుడు రోజూ 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను తయారు చేస్తున్నాం’ అని ఉదహరించారు. 21వ శతాబ్దం భారత్‌దేనన్న కలను నిజం చేయటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. స్వయం ప్రకాశం అత్యవసరం. భారత్‌కు ఇప్పుడు అదొక్కటే మార్గం అని స్పష్టంచేశారు. ‘స్వయం ప్రకాశం అనే మాటకు అర్థం మారింది. ప్రపంచవ్యాప్తంగా దాని అర్థం మారుతున్నది. భారత సంస్కృతి, వారసత్వం ఈ స్వయం ప్రకాశం గురించే మాట్లాడుతుంది. ప్రపంచమంతా ఒక్కటే అనేదే దాని పరమార్థం’ అని మోదీ అన్నారు.  

ఆర్థిక వ్యవస్థకు ఐదు పిల్లర్లు

భారత ఆర్థిక వ్యవస్థ స్వయంప్రకాశానికి మోదీ ఐదు మూల స్తంభాలను ప్రకటించారు. ఆర్థికవ్యవస్థ, మౌలికసదుపాయాలు, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ, జనాభా, డిమాండ్‌ అనేవి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే కీలకాంశాలని పేర్కొన్నారు. ‘ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మన భూమి, శ్రమ, ద్రవ్య లభ్యత, చట్టాలకు బలాన్నిస్తుంది. కూలీలు, రైతులు, పన్నుచెల్లించేవారు, సూక్ష్మచిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమల అవసరాలు తీరుస్తుంది’ అని తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గతంలో కేంద్రం రూ.1.7లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంకు కూడా చిన్న పరిశ్రమలను ఆదుకొనేందుకు కొన్ని ఉద్దీపనలు ప్రకటించింది. వాటన్నింటితో కలుపుకొని మొత్తం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని అమలుచేస్తామని మోదీ తెలిపారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీల్లో ఒకటి!

న్యూఢిల్లీ, మే 12: మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ మన జీడీపీలో దాదాపు 10 శాతం. అమెరికా ప్రకటించిన ప్యాకేజీ విలువ ఆ దేశ జీడీపీలో 13 శాతం ఉండగా, జపాన్‌ ఏకంగా ఆ దేశ జీడీపీలో 21 శాతంతో సమానమైన మొత్తాన్ని ప్యాకేజీగా ప్రకటించింది. 


logo