మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 03:27:05

చితికిన బతుకులు

చితికిన బతుకులు
  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
  • కేరళకు చెందిన 20 మంది దుర్మరణం
  • కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్‌ లారీ
  • టైరు పగిలి లారీ అదుపుతప్పడమే కారణం

కోయంబత్తూరు/తిరువనంతపురం, ఫిబ్రవరి 20: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పుడు మార్గంలో వచ్చిన కంటైనర్‌ లారీ కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు నామరూపాలు లేకుండా తునాతునకలైంది. సేలం-కోచి రహదారిలోని తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం చెందగా, 28 మంది గాయపడ్డారు. 


మరణించిన వారిలో ఆరుగురు మహిళలతోపాటు బస్సు డ్రైవర్‌ వీడీ గిరీశ్‌, కండక్టర్‌ వీఆర్‌ బైజు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా కేరళకు చెందినవారేనని చెప్పారు. బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సులో 48 మంది ప్రయాణికులున్నారని, ప్రమాదం జరిగినప్పుడు వారిలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో కొందరిని తిరుప్పూర్‌ ప్రభుత్వ దవాఖానకు, మరికొందరిని కోయంబత్తూరు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరు ప్రమాదం షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్‌ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 


గాయపడినవారికి సాయంగా ఉండటానికి రవాణా మంత్రి ఏకే శశింద్రన్‌, వ్యవసాయ మంత్రి వీఎస్‌ సునీల్‌కుమార్‌ను ఘటనా స్థలానికి పంపించారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. కాగా, కంటైనర్‌ లారీ టైరు పగలడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని, మృతులంతా కేరళకు చెందినవారేనని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తెలిపారు. మరోవైపు ప్రమాదం అనంతరం పారిపోయిన కంటైనర్‌ లారీ డ్రైవర్‌ హేమరాజ్‌ను అనంతరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు ఎర్నాకుళంకు చెందిన వ్యక్తి అని, టైల్స్‌ లోడుతో వెళ్తున్న కంటైనర్‌ లారీ టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి తప్పుడు మార్గంలోకి వచ్చి కేరళ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొన్నదని పాలక్కాడ్‌ ఎస్పీ శివ విక్రమ్‌ తెలిపారు. కేరళ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


logo