గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 10:15:42

కరోనా చికిత్స కోసం బిడ్డలను మార్చుకున్న తల్లులు

కరోనా చికిత్స కోసం బిడ్డలను మార్చుకున్న తల్లులు

గాంగ్టక్‌: కరోనా చికిత్స కోసం ఇద్దరు తల్లులు తమ బిడ్డలను మార్చుకున్నారు. ఈ అరుదైన ఘటన సిక్కిం రాష్ట్రంలో చోటుచేసుకున్నది. 27 రోజుల పసి బిడ్డకు శుక్రవారం కరోనా సోకింది. అయితే ఆ బిడ్డ తల్లికి నెగిటివ్‌గా వచ్చింది. దీంతో చికిత్స కోసం ఆ బిడ్డను ప్రభుత్వ దవాఖానకు తరలించగా ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కాగా మరో మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది. అయితే ఆ మహిళ కుమారుడైన ఆరేండ్ల బాలుడికి నెగిటివ్‌గా వచ్చింది. దీంతో ఆ బాలుడు ఒంటరయ్యాడు.

ఈ నేపథ్యంలో తమ బిడ్డల ఆలనాపాలనా కోసం ఇద్దరు తల్లులు ఓ అవగాహనకు వచ్చారు. కరోనా చికిత్స పొందేంత వరకు ఒకరి బిడ్డను మరొకరు చూసుకునేందుకు మార్పిడి చేసుకున్నారు. దీంతో కరోనా సోకిన 27 రోజుల బిడ్డ బాగోగులను పాజిటివ్‌గా వచ్చిన మహిళ చూసుకుంటున్నది. నెగిటివ్‌గా వచ్చిన బిడ్డ తల్లి, కరోనా సోకని ఆరేండ్ల బాలుడిని తన వెంట ఇంటికి తీసుకెళ్లింది. ఈ ఇద్దరి తల్లుల పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యులు, అధికారులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తమ బిడ్డల క్షేమం కోసం ఆ తల్లులు తీసుకున్న  నిర్ణయంపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 
logo