‘అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సాధారణ జీవితాల్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. ఒత్తిడిని పెంచుకుంటున్నాం. ఆ ధోరణి నుంచి బయటపడాలి. ప్రేమను పంచే గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మన జీవితం బాగుండటమే కాకుండా ఎదుటివారికి సంతోషాన్ని పంచగలుగుతాం’ అంటున్నది నటి నివేదా థామస్. ‘జెంటిల్మన్’, ‘నిన్నుకోరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై పోరాడే యువతిగా అద్భుత నటనను కనబరిచిన నివేదా థామస్ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలివి..
గ్లామర్‌తో ముడిపడిన సినీ పరిశ్రమపై ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా అందరికీ తొందరగా తెలిసిపోతుంది. అందువల్లే ఇండస్ట్రీలో జరిగే తప్పుల్ని ప్రతి ఒక్కరూ వేలేత్తి చూపుతుంటారు. చిత్రసీమలో మహిళలకు రక్షణ లేదు, అఘాయిత్యాలు జరుగుతుంటాయని మాట్లాడుకోవడం నేను విన్నా. కానీ యథార్థం ఏమిటంటే ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచంలోని ప్రతి రంగంలో మహిళలు వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో, స్కూల్స్‌లో, కాలేజీలో, వర్క్‌ప్లేస్‌లో ఇలా ప్రతిచోటా ఇవి సాధారణం అయిపోయాయి. సమస్యలు ఎదురయ్యాయా? లేదా? అనే దానిపై ముందుగానే అభిప్రాయానికి రావడం కంటే తమకు ఎదురైన కఠిన పరిస్థితుల గురించి మహిళలు ఏం చెబుతున్నారో వినాలి. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తే బాగుంటుంది. సాటివారిని ఎలా ఉన్నారని అడిగితే సరిపోదు! వారు చెప్పే సమాధానం వెనుక ఉండే ఉద్వేగాల్ని, సంఘర్షణను అర్థం చేసుకోవాలి.
కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారా?
‘వకీల్ సాబ్’ విడుదలకు ముందు కరోనా బారిన పడటంతో చాలా బాధపడ్డా. నేను నటించిన ప్రతి సినిమాను తొలిరోజు థియేటర్లో చూడటం నాకు అలవాటు. కొవిడ్ కారణంగా మొదటిరోజు ‘వకీల్ సాబ్’ను థియేటర్లో చూడలేకపోయా. ఇటీవల నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సమయం పడుతుంది.
సినిమాలు, చదువు రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు?
ఇన్నేండ్లు చదువు, సినిమాలు ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేశా. గతేడాది డిగ్రీ పూర్తయింది. సినిమాలతోపాటు చదువూ ముఖ్యమే అనిపించింది. అందువల్లే ఇన్నాళ్లు అవకాశాలు వచ్చినా చాలా సినిమాలు తిరస్కరిస్తూ వచ్చా. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంది.
టాలీవుడ్లో ఐదేండ్ల ప్రయాణంలో కేవలం తొమ్మిది సినిమాలు మాత్రమే చేశారు? ఎందుకలా?
ఒకేసారి నాలుగైదు సినిమాల్ని అంగీకరించే విధానానికి నేను వ్యతిరేకం. మల్టీటాస్కింగ్ చేయలేను. ఒక సినిమా పూర్తిచేసిన తర్వాతే తదుపరి చిత్రంపై దృష్టి పెడతా. ఎంచుకునే ప్రతీ పాత్ర సవాళ్లతో కూడింది కావడమే అందుకు కారణంగా భావిస్తున్నా. ఈ పాత్రల కోసం సన్నద్ధమవ్వడానికి మానసికంగా, శారీరకంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. వేగం పెంచుతూ ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచనలు లేవు. ఇంకో ఇరవై, ముప్పై ఏండ్లు ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. నటనకు దూరమైనా ఇతర విభాగాలపై దృష్టి పెడతా. నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది కాబట్టి తొందరేమీ లేదనుకుంటున్నా.
మీ కెరీర్లో విజయాల శాతం ఎక్కువ. అదెలా సాధ్యమైందని భావిస్తున్నారు?
కెరీర్లో విజయాల శాతం ఎక్కువగా ఉండటం ఆనందమే. అయితే నేను నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందన్న మాట నటిగా నా బాధ్యతల్ని మరింత పెంచుతుంది. అలాంటి మాటలు భయాన్ని కూడా కలిగిస్తుంటాయి. సమీక్షలు, ప్రశంసల కన్నా నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో, సినిమా చూస్తున్నప్పుడు వారి ఫీలింగ్స్ ఏమిటో ప్రత్యక్షంగా గమనిస్తుంటా. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడే తప్పొప్పుల్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని నమ్ముతా. ప్రేక్షకుల కోణం నుంచి ఆలోచిస్తూ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటా.
సినిమాల ఎంపికలో మీరు ప్రాధాన్యమిచ్చే అంశాలేవి?
హీరోయిన్గా మాత్రమే నటించాలనే పరిమితులు పెట్టుకోలేదు. కథ, పాత్ర నచ్చితే అందులో ఎవరు నటిస్తున్నారనే విషయాల్ని పట్టించుకోను. పాత్ర నిడివి గురించి ఆలోచించను. నా మనసుకు పాత్ర నచ్చాలి. అంతకుమించి ఏం కోరుకోను.
సినీ కెరీర్ పరంగా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలేవి?
భారీ బడ్జెట్ సినిమాలు చేయాలి, పెద్దస్టార్స్తో నటించాలనే కలలు నాకు లేవు. గత పాత్రల ప్రభావం కనిపించకుండా చేయగలగాలి. ప్రతి సినిమాలో నటిగా నవ్యరీతిలో నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ప్రాముఖ్యమిస్తా. విభిన్నమైన పాత్రలకు నేను న్యాయం చేయగలనని నిరూపించుకోవాలనుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నా.
ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో మహిళా ప్రధాన చిత్రాల సంఖ్య ఆశించిన స్థాయిలో రావడం లేదనే విమర్శలున్నాయి?
మహిళల శక్తి సామర్థ్యాల్ని చాటిచెబుతూ లక్ష్యసాధన కోసం వారు చేసే పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా కమర్షియల్ సినిమాల్లో చూపిస్తుండటం బాగుంది. ‘బ్రోచేవారెవరురా’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో అలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి. ప్రస్తుత జనరేషన్లో సాయిపల్లవితోపాటు పలువురు హీరోయిన్లు మహిళా ప్రధాన ఇతివృత్తాలతో అర్థవంతమైన సినిమాలు చేస్తున్నారు. కథానాయికలను మంచిపాత్రలు వరిస్తున్నాయి. హీరోలతో సమానంగా తెరపై వారి పాత్రల్ని ఆవిష్కరిస్తుండటం ఆనందంగా ఉంది.
సినిమాల ద్వారా చెప్పే సందేశాలు ప్రజల్లో మార్పును తీసుకొస్తాయంటారా?
థియేటర్లో సినిమాను ఆస్వాదించడంతోపాటు అందులో చెబుతున్న మంచిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. అవసరమైన సమయాల్లో ఆ సందేశాన్ని మననం చేసుకుంటేనే చిత్రబృందం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఒక్కరాత్రిలోనే మార్పును తీసుకొచ్చే శక్తి సినిమాలకు ఉండక పోవచ్చు. అందులో చర్చించిన అంశాల గురించి మాట్లాడటమే కాకుండా మంచిని మన జీవితాలకు అన్వయించుకుంటే మెల్లగా మార్పు సాధ్యమవుతుంది.
నో.. చెప్పడం తేలిక కాదు
చాలా విషయాల్లో నచ్చలేదనే మాటను చెప్పడంలో మహిళలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తప్ప ఇతరులకు తెలియదు. వాస్తవాలు తెలుసుకోకుండా మరొకరిని జడ్జ్ చేయడం మంచిదికాదు. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా వారిని చులకన చేయడం సరికాదు. చూడటానికి సింపుల్‌గానే అనిపించే ఇలాంటి చిన్న విషయాలు జీవితంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.