నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బీరం
సస్యశ్యామలం కానున్న 2000ఎకరాల ఆయకట్టు
ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష
కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్4: కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం సమీప అడవుల్లో ఉన్న జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు మహర్దశ పట్టనున్నది. ప్రాజెక్టుకు పాలమూరు-రంగారెడ్డి పథకం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మినీ లిఫ్ట్ లేదా స్లూయీస్ రంధ్రాల ద్వారా సాగునీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఈ విషయాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కొంతకాలం నుంచి పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పీఆర్ఎల్ఐ, ఎంజీకేఎల్ఐ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే బీరం ప్రాజెక్టు విషయం విన్నవించిన సంగతి అధికారులతో చర్చించారు. త్వరగా జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 5దశాబ్దాల కాలం కిందట అడవిలో వర్షాధారంగా నిర్మించబడ్డ జీల్దార్తిప్ప ప్రాజెక్టు ఒకసారి నిండితే దాని కింద 2000ఎకరాల బీడు భూములు సాగుకు నోచుకుంటాయి. ఏండ్ల తరబడి ఈప్రాజెక్టుకు ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరందించాలని అక్కడి గ్రామస్తులు కోరుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అదిగోపులి, ఇదిగో తోక అంటూ మాటలు చెబుతూ పాలకులు ఇన్నాళ్లూ కాలం వెళ్లబుచ్చారు. కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నట్టడవిలో ఉన్న జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు మినీ లిఫ్ట్ ద్వారా నీళ్లందించాలని కొంతకాలంగా ఎమ్మెల్యే బీరం సీఎంకు విజ్ఞప్తి చేస్తూవస్త్తున్నారు. ఇన్నాళ్లకు ఎమ్మెల్యే కృషి ఫలించి ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
ఇదిలా ఉండగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి మినీ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలా..? లేక స్లూయీస్ రంధ్రాల ద్వారానే ప్రాజెక్టుకు సాగునీరందించాలా అనే విషయంపై అధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం చర్చించినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సాగునీరందితే అడవికి దగ్గరగా ఉన్న మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల భూములు సస్యశ్యామలం అవుతాయి. దశాబ్దాల తరబడి సాగునీటి పంచాయితీలకు తెరపడతుంది. శాశ్వత నిర్మాణాలపై దృష్టిపెట్టి వాటిని సాధించేందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేస్తున్న కృషిని పలువురు హర్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి