గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 13:39:13

కరోనా పరీక్షలపై కొట్లాట.. ఇద్దరు మృతి

కరోనా పరీక్షలపై కొట్లాట.. ఇద్దరు మృతి

భిండ్ (ఎం.పి): మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా పరీక్షల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారిని స్థానికులు అనుమానంగా చూస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షలపై తలెత్తిన వివాదం హింసాకాండకు దారితీసి ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లా ప్రేంనగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులలో ఒకరు వృద్ధమహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పరీక్షలు జరపాలని ఓ వర్గం వారు పట్టుబట్టారు. దానికి అతడు నిరాకరించాడు. తనకు ఇదివరకే నెగెటివ్ వచ్చిందని చెప్పాడు. కానీ ఇవతలి వర్గం వారు పరీక్ష జరపాల్సిందేనని అన్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగి కొట్లాటకు దారితీసింది. మద్యప్రదేశ్‌లో కరోనాపై హింసాకాండ చెలరేగడం ఇది వారంలో రెండోసారి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo