బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 19:13:37

వుహాన్‌కు చేరిన భారతీయుల్లో 19 మందికి కరోనా

వుహాన్‌కు చేరిన భారతీయుల్లో 19 మందికి కరోనా

న్యూఢిల్లీ: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా చైనాలోని వుహాన్‌కు చేరిన భారతీయుల్లో 19 మందికి కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. 277 మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ నుంచి వుహాన్‌కు ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం శుక్రవారం చేరింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 39 మందికి కరోనా లక్షణాలు లేకపోయినా వారిలో రోగనిరోధకాలు కనిపించాయి. దీంతో 59 మంది ప్రయాణికులను కోవిడ్‌19 దవాఖాన, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మిగతా ప్రయాణికులను పలు హోటల్స్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఇటీవల భారత్‌ నుంచి చైనాకు వెళ్లిన విమానాల్లో కరోనా సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి. వందే భారత్‌ మిషన్‌ కింద ఇప్పటి వరకు చైనాకు ఆరు ప్రత్యేక విమాన సర్వీసులను నడిపారు. 

కరోనా నేపథ్యంలో ఇరు దేశాల్లో వేల సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. భారత్‌ నుంచి చైనాకు తిరిగి వెళ్లేందుకు 1500 మందికిపైగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చైనాలోని సుమారు 23 వేల మంది భారతీయ విద్యార్థులను ఆ దేశం ఎప్పుడు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇస్తుందో తెలియడం లేదు. కరోనా వైరస్‌ ఉనికిలోకి వచ్చిన చైనాలోని వుహాన్‌ నగరానికి ఈ నెలలో మరో విమాన సర్వీస్‌ కోసం చైనా నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. తాజాగా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి కరోనా సోకినట్లుగా పరీక్షల్లో తేలడంతో తదుపరి విమాన సర్వీసులపై ప్రభావం పడవచ్చని తెలుస్తున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.