శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 15:14:40

ఆ 17 మంది జవాన్లు మృతి

ఆ 17 మంది జవాన్లు మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన 17 మంది భద్రతా సిబ్బంది విగతజీవులై కనిపించారు. శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతగుఫా ఏరియాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో వారంతా మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను హెలిక్యాప్టర్లలో రాయ్‌పూర్‌కు తరలించినట్లు వెల్లడించారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో విషాధ చాయలు అలుముకున్నాయి.  

చింతగుఫా ఏరియాలో శనివారం మధ్యాహ్నం మావోయిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చింతగుఫా ఏరియాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా విభాగాలకు చెందిన సుమారు 150 మంది భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. 

కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది భద్రతాసిబ్బంది గాయపడ్డారు. మరో 17 మంది కనిపించకుండా పోయారు. ఈ సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను రంగంలోకి దించారు. గాయపడిన వారిని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించి, అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో విగతజీవులుగా పడి ఉన్న 17 మంది జవాన్ల మృతదేహాలను ఆదివారం గుర్తించారు. 


logo