సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 30, 2020 , 18:45:35

ఒడిశాలో భారీ వర్షాలు, వరదలకు 17 మంది మృతి

ఒడిశాలో భారీ వర్షాలు, వరదలకు 17 మంది మృతి

భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంభవించిన వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనల్లో 17 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. సుమారు 10,382 ఇళ్ళు దెబ్బతిన్నట్లు పేర్కొంది. 20 జిల్లాల పరిధిలోని 3,256 గ్రామాలను వరదలు ముంచెత్తినట్లు చెప్పింది. దీంతో సుమారు  14,32,701 మంది ప్రజలు ప్రభావితమమైనట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

ఒడిశాలోని కొఠరా పరిధిలోని గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఆ రాష్ట్ర విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, కటక్ 6వ బెటాలియన్‌కు చెందిన స్పెషల్ ఆర్మీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పంగాట గ్రామానికి చెందిన ఇద్దరిని, ఠాకూర్పూర్ గ్రామానికి చెందిన నలుగురిని వారి ఇండ్ల పైకప్పు నుంచి బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఠాకూర్‌పట్నాకు చెందిన పక్షవాతం ఉన్న రోగిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంకాసాహి నుండి 10 మందిని రక్షించి కథూరి సహాయ శిబిరానికి తరలించారు. మరోవైపు కటక్‌లోని ముండలి బ్యారేజ్ వద్ద మహానదిలో నీటి మట్టం బాగా పెరిగింది. దీంతో హిరాకుడ్ డ్యామ్‌లోని 46 స్లూయిస్ గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo