ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 12:52:44

24 గంటల్లో 17 మంది వలస కార్మికులు మృతి

24 గంటల్లో 17 మంది వలస కార్మికులు మృతి

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవడంతో.. వలస కూలీలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. కొందరు బస్సుల్లో, ఇంకొందరు ట్రక్కుల్లో, మరికొందరు కాలినడకన తమ ప్రయాణాలు ప్రారంభించారు. వీరిలో కొందరు మార్గమధ్యలోనే రోడ్డుప్రమాదలకు బలవుతున్నారు. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 17 మంది వలస కార్మికులు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. మరో 93 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

బుధవారం రాత్రి హర్యానా నుంచి బీహార్‌కు వలస కార్మికులు కాలినడకన బయల్దేరారు. యూపీలోని ముజఫర్‌నగర్‌ - షాహారన్‌పూర్‌ హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 36 ఏళ్ల ఓ కూలీ తన కుటుంబంతో గుర్గావ్‌కు వలస వెళ్లాడు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో.. ఆ కూలీ తన కుటుంబంతో కాలినడకన సొంతూరికి బయల్దేరాడు. ఢిల్లీ - గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వారిని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూలీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

గురువారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి యూపీకి వెళ్తున్న వలస కూలీల ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా యూపీలోని ఉన్నావ్‌, రాయ్‌బరేలీ జిల్లాలకు చెందిన వారు. వీరు ట్రక్కులో ప్రయాణించేందుకు ఒక్కొక్కరు రూ. 4 వేలు చెల్లించారు. 

వలస కార్మికులతో వెళ్తున్న ఓ బస్సు బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 24 మందికి గాయాలయ్యాయి. ఇలా తరుచూ ఎక్కడో ఓ చోట వలస కార్మికులు రోడ్డుప్రమాదాలకు బలవుతూనే ఉన్నారు.


logo