మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:25:57

అయోధ్యలో కరోనా కలకలం

అయోధ్యలో కరోనా కలకలం

  • రామమందిరం పూజారి, 16 మంది పోలీసులకు పాజిటివ్‌ 
  • యూపీ సీఎంతో కలిసి ఇటీవల పూజలు చేసిన ప్రదీప్‌దాస్‌ 
  • 5న శంకుస్థాపన యథాతథమన్న ట్రస్టు 

అయోధ్య, జూలై 30: రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ అయోధ్య ఆలయంలో కరోనా వైరస్‌ ఉనికి కలకలం రేపుతున్నది. రామ మందిరంలో ప్రధాన పూజారి సహాయకుడిగా ఉన్న పూజారి ప్రదీప్‌ దాస్‌తో పాటు రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో విధులు నిర్వహిస్తున్న 16 మంది పోలీసు సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆలయ ట్రస్టు వెల్లడించింది.ప్రదీప్‌దాస్‌తో పని చేస్తున్న నలుగురు ఇతర పూజారులు, ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌కు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని పేర్కొంది. ఆగస్టు 5న జరుగబోయే క్రతువు పనులను పర్యవేక్షించేందుకు గత శనివారం యూపీ సీఎం యోగి రామ జన్మభూమి కాంప్లెక్స్‌ను సందర్శించారు. యోగి పక్కనే ప్రదీప్‌దాస్‌ నిల్చొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

శంకుస్థాపనకు సకల ఏర్పాట్లు 

అయోధ్యలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ట్రస్టు వెల్లడించింది. ప్రణాళిక ప్రకారమే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేసింది. కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్లు  ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగత్‌ తదితరులు కూడా హాజరయ్యే అవకాశమున్నదని తెలిపింది. శ్రీరాముడి చరిత్రను తెలియజేసే గ్రాఫిటీ పెయింటింగులను  రోడ్డుకు ఇరువైపులా కనిపించేలా వేసినట్టు వివరించారు. సీసీటీవీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేయడంతోపాటు భక్తులు కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద పెద్ద తెరలను కూడళ్లలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయోధ్యలో భూమిపూజ మనదేశపు సాంస్కృతిక జాతీయవాదాన్ని కండ్ల ముందు ఉంచుతుందని వీహెచ్‌పీ సెక్రెటరీ జనరల్‌ మిళింద్‌ పరండే అభిప్రాయపడ్డారు.

రామ మందిరంపై మాట నిలుపుకున్న మోదీ!

రామమందిర నిర్మాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్నప్పుడు 1991లో అయోధ్యను సందర్శించిన అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్‌ జోషి వెంటే నరేంద్రమోదీ ఉన్నారు. మళ్లీ అయోధ్యకు ఎప్పుడు వస్తారన్న మీడియా ప్రశ్నలకు మోదీ ప్రతిస్పందిస్తూ.. రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడు వస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన ఆలయ భూమి పూజకు వెళ్లనున్నారు. 


logo