శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 02:30:27

ఇల్లు చేరని వలస

ఇల్లు చేరని వలస

  • నిద్రిస్తున్న కూలీలపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్‌ రైలు
  • 16 మంది అక్కడికక్కడే దుర్మరణం
  • మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో దుర్ఘటన
  • కార్మికులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు
  • రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

ఔరంగాబాద్‌, మే 8: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీల మీదుగా గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 16 మంది కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఔరంగాబాద్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని కర్మద్‌లో శుక్రవారం వేకువజామున 5.15 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. మృతులందరూ మధ్యప్రదేశ్‌కు చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వలస కూలీలు జల్నాలోని ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో స్వస్థలమైన భుసావల్‌కు తిరిగి వెళ్తున్నారు. గురువారం రాత్రి జల్నా నుంచి కాలినడకన బయలుదేరారు. పోలీసుల కంటపడకూడదన్న ఉద్దేశంతో రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. సుమారు 40 కిలోమీటర్లు  నడిచిన తర్వాత తీవ్రంగా అలసిపోవడంతో పట్టాలపైనే నిదురించారు. అయితే కలలో కూడా ఊహించని విధంగా మృత్యువు వారిని కాటేసింది. జల్నా నుంచి వేగంగా వచ్చిన గూడ్స్‌ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో 16 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరు గాయపడ్డారు.  పట్టాలకు దూరంగా పడుకున్న ముగ్గురు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. రైలు వస్తుండడాన్ని గమనించిన వీరు.. పట్టాలపై నిదురిస్తున్న తమ సహచరులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గట్టిగా అరుస్తూ వారిని నిద్రలేపేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నం వృథా అయింది. కూలీల మీదుగా రైలు దూసుకెళ్లింది. వారం కిందటే తాము ఈ-ట్రాన్సిట్‌ పాస్‌ల కోసం దరఖాస్తు చేశామని, అయితే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో  కాలినడకన బయలుదేరినట్లు ప్రమాదం నుంచి   బయటపడిన ధీరేంద్ర సింగ్‌ అనే కూలీ తెలిపారు.

లోకోపైలట్‌ హారన్‌ కొట్టినా..

పట్టాలపై పడుకున్న వలస కూలీలను నిద్రలేపేందుకు లోకోపైలట్‌ హార్న్‌ కొట్టారని, రైలు వేగాన్ని తగ్గించేందుకు కూడా ప్రయత్నించారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినప్పటికీ ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్‌కు ‘చీఫ్‌ రైల్వే సేఫ్టీ కమిషనర్‌' లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా రైళ్లు తిరగవని భావించి కార్మికులు పట్టాలపై పడుకున్నారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. 

ప్రముఖుల దిగ్భ్రాంతి..

ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు కూడా బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఇరువురు సీఎంలు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. logo