బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 12:21:33

ఆదమరిచి పట్టాలపై పడుకున్నారు.. పైనుంచి రైలు వెళ్లింది!!

 ఆదమరిచి పట్టాలపై పడుకున్నారు.. పైనుంచి రైలు వెళ్లింది!!

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. బతుకుదెరువు కోసం ఇల్లు వదిలి వెళ్లిన బడుగు జీవుల బాధలు వర్ణాతీతం. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలకు మరిన్ని కష్టాలు తోడు అయ్యాయి. తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధి లేకపోవడంతో.. పస్తుండాల్సిన పరిస్థితి. పూట గడవడం కష్టంగా మారింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో.. చేసేదేమీ లేక సొంతూరికి పయనమవుతున్నారు.

అలా సొంతూర్లకు వెళ్తున్న వారి పరిస్థితి దారుణం. కొందరు ఆకలితో అలమటిస్తుంటే.. మరికొందరు నీరసించి కుప్పకూలిపోతున్నారు. ఇంకొందరు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. కరోనా వస్తే చస్తామని భయపడుతున్న వలస కార్మికులను మరో రూపంలో మృత్యువు మింగేస్తుంది. కరోనా కష్టకాలంలో చావు ఎవరికీ ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. 

ఔరంగాబాద్‌ రైలు ప్రమాద ఘటనలో 16 మంది వలస కార్మికుల మృత్యువాత అందరిలో విషాదాన్ని నింపింది. అలసిపోయి రైలు పట్టాలపై పడుకున్న వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. రైలు పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వారు తెచ్చుకున్న ఆహారం పట్టాల మధ్య పడిపోయింది. ఈ దృశ్యాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. 

మధ్యప్రదేశ్‌లోని ఉమార్యా, సాహ్‌డోల్‌ గ్రామాలకు చెందిన సుమారు 19 మంది వలస కార్మికులు పొట్టకూటి కోసం మహారాష్ట్ర జల్నాలోని ఎస్‌ఆర్‌జీ కంపెనీలో పని చేసేందుకు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎస్‌ఆర్‌జీ కంపెనీని మూసేశారు. పూట గడవడం కష్టంగా మారడంతో ఈ 19 మంది కూలీలు తమ సొంతూర్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కూలీలు తమ ప్రయాణాన్ని జల్నా నుంచి ప్రారంభించారు.


సాయంత్రం 7 గంటల సమయంలో కూలీలు తమ నడకను ప్రారంభించి.. రోడ్డు మార్గాన బద్నాపూర్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి ఔరంగాబాద్‌కు వెళ్లేందుకు రైల్వే మార్గాన్ని కూలీలు ఎంచుకున్నారు. బద్నాపూర్‌ నుంచి 36 కిలోమీటర్లు నడిచిన తర్వాత కూలీలంతా అలసిపోయారు. రాత్రి కావడంతో.. విశ్రాంతి తీసుకుందామని.. పట్టాలపైనే నిద్రించారు. 14 మంది రైలు పట్టాలపై పడుకోగా, మరో ఇద్దరు పట్టాల పక్కన, మరో ముగ్గురు ట్రాక్‌కు దూరంగా పడుకున్నారు. 

మరికాసేపట్లో నిద్ర లేచి తమ ప్రయాణాన్ని ప్రారంభిద్దామనుకునే లోపే వలస కూలీలను మృత్యువు మింగేసింది. వేగంగా వచ్చిన గూడ్స్‌ రైలు కూలీలపై దూసుకెళ్లింది. అక్కడికక్కడే 14 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.


logo