ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 14:41:04

ఎల్‌ఏసీ సమీపంలో 16 చైనా సైనిక శిబిరాలు

ఎల్‌ఏసీ సమీపంలో 16 చైనా సైనిక శిబిరాలు

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో చైనాకు చెందిన 16 సైనిక శిబిరాలున్నాయి. ప్లానెట్‌ ల్యాబ్స్‌ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయట పడింది. జూన్‌ 15-16 తేదీల్లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్రస్థాయి ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన సుమారు 45 మంది సైనికులు కూడా ఈ ఘర్షణలో మరణించి ఉంటారని తెలుస్తున్నది. కాగా ఈ ఘర్షణ నేపథ్యంలో ఈ నెల 22న ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో జరిగిన చర్చల్లో సైనిక బలగాలను తగ్గించుకునేందుకు భారత్‌, చైనా అంగీకరించాయి. 

అయితే ఈ నెల 22 తర్వాత గల్వాన్‌ లోయ వద్ద తన సైనికులను చైనా భారీగా మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. ప్లానెట్‌ ల్యాబ్స్‌ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో ఎల్‌ఏసీ సమీపంలో  నల్లటి టార్పాలిన్లు కనిపించాయి. సుమారు 16కుపైగా ఉన్న ఇవి చైనా సైనిక శిబిరాలుగా తెలుస్తున్నది. అలాగే గల్వాన్‌ నదికి ఆవల భారత్‌ ఆర్మీ నిర్మించిన రాతి గోడను ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తున్నది. ఈ చిత్రాల్లో ఎక్కడా కూడా భారత సైనిక శిబిరాలు కనిపించలేదు. 

లడఖ్‌లోని సబ్ సెక్టార్ నార్త్ ఏరియాలోని కీలకమైన వ్యూహాత్మక దుర్బుక్-దౌలత్ బేగ్ ఓల్డీ హైవేకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ చైనా స్థావరాలు ఉన్నాయి. భారతీయ దళాలకు ఈ ప్రాంతం ఎంతో వ్యూహాత్మకమైనది. కరాకోరం పాస్ నుంచి అక్సాయ్ చిన్ వరకు చైనా సైనికుల కదలికలను భారత దళాలు నిశితంగా గమనించే వీలుంది. ఇంతటి కీలకమైన ఈ ప్రాంతంలోని ఎల్‌ఏసీ వెంబండి సుమారు 9 కిలోమీటర్ల మేర చైనాకు చెందిన 16 సైనిక శిబిరాలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. అలాగే గల్వాన్‌ నది వెంబడి చైనా చేపడుతున్న నిర్మాణ పనులు కూడా ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


 

logo