శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 11, 2021 , 10:24:45

దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు చేరాయి. ఇందులో 1,00,92,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,22,526 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,51,160 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 19,299 మంది ఈ ప్రాణాంతక వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. కొత్తగా 161 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

దేశంలో నిన్నటి వరకు 18,17,55,831 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో జనవరి 10న 6,59,209 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది. 


కాగా, కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీకా పంపిణీకి ఏర్పాట్లు, విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వర్చువల్‌ విధానంలో ఈసమావేశం జరుగనుంది. ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభంకానుంది.