గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 02:31:52

100 కోట్ల మంది కన్నా..15 కోట్ల ముస్లింల బలమే ఎక్కువ

100 కోట్ల మంది కన్నా..15 కోట్ల ముస్లింల బలమే ఎక్కువ
  • ఎంఐఎం నేత పఠాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఖండించిన పార్టీ

ఔరంగాబాద్‌, ఫిబ్రవరి 21: వంద కోట్ల మంది కన్నా 15 కోట్ల ముస్లింల బలమే ఎక్కువంటూ మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం నేత వరీస్‌ పఠాన్‌ చేసిన వ్యాఖ్యలు విదాస్పదమయ్యాయి. ఇటీవల కర్ణాటకలోని కలబురగి ప్రాంతంలో నిర్వహించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక సభలో వరీస్‌ పఠాన్‌ మాట్లాడుతూ ‘మనమంతా కలిసి నడవాలి. మనమంతా స్వాతంత్య్రాన్ని సంపాదించాలి. ఈ స్వాతంత్య్రాన్ని మనం అడిగి తీసుకోవడం కాదు.. బలవంతంగా గుంజుకోవాలి. గుర్తుపెట్టుకోండి.. మనం 15 కోట్ల మందే ఉండొచ్చు.. కానీ 100 కోట్ల మంది కన్నా మన బలం ఎక్కువ.. మరిచిపోకండి’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో స్పందించిన ఎంఐఎం మహారాష్ట్ర అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని చెప్పారు.


వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేయనున్నామన్నారు. మరోవైపు పఠాన్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర స్పందిస్తూ వాళ్లు (ఎంఐఎం నేతలు) చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుంటారని, కానీ వారి గుండెల్లో మాత్రం పఠాన్‌లాంటి వాళ్లు ఉంటారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి సీఏఏ వ్యతిరేక ఆందోళనల పేరుతో భారీ కుట్ర జరుగుతున్నట్లు పఠాన్‌ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నదని ఆరోపించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వాళ్లు పఠాన్‌ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.


logo