గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 16:53:41

ఢిల్లీలో 144 సెక్షన్‌..

ఢిల్లీలో 144 సెక్షన్‌..

న్యూఢిల్లీ: దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఒకే ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది.  దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు బయటకు రాకూడదనీ, సమూహాలుగా ఏర్పడకూదని ఈ నిర్ణయం తీసుకుంది. తమకు తాము స్వీయ నిర్బంధం పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు స్వతహాగా ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. కాగా, ఢిల్లీలో సెక్షన్‌ 144 ఇవాళ రాత్రి 9 గంటల నుంచి మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు అమలులో ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. 

ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ సేవలు మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు మెట్రోరైల్‌ సంస్థ తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటికే 341 మంది కోవిద్‌-19 మహమ్మారి బాధితులు ఉన్నారు. వారిని ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. కరోనా కారణంగా దేశంలో మృతుల సంఖ్య 7కు చేరింది. కొద్ది గంటల ముందు సూరత్‌లో ఒక వ్యక్తి మరణించారు. నిన్నటి వరకు నలుగురు వ్యక్తులు మాత్రమే కరోనా కారణంగా మరణించగా, ఈ ఒక్కరోజే ముగ్గురు మరణించారు. 

144 సెక్షన్‌ విధించడంపై ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే 144 సెక్షన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.


logo
>>>>>>