గురువారం 03 డిసెంబర్ 2020
National - Sep 07, 2020 , 23:00:43

స్వచ్ఛ గాలి ఇస్తారా.. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకోమంటారా!

 స్వచ్ఛ గాలి ఇస్తారా.. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకోమంటారా!

డెహ్రాడూన్ : అందరికీ స్వచ్ఛమైన గాలిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ 12 ఏండ్ల పర్యావరణ కార్యకర్త రిధిమా పాండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమా పాండే, అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్ కోసం లేఖ రాశారు. స్వచ్ఛమైన గాలిని అందిస్తారా.. లేక భవిష్యత్ తరాలు ఆక్సిజన్ సిలిండర్లు భుజానికి వేలాడేసుకుని తిరగమంటారా? అంటూ కాస్తా ఘాటుగానే లేఖలో ప్రధానికి చురక అంటించింది. తన చేతిరాతతోనే మోదీకి రిధిమా లేఖ రాసింది.

ఢిల్లీ, వారణాసి, ఆగ్రా, ముంబై, చెన్నైలతోపాటు జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నదని, ఇది అక్కడ నివసించే ప్రజలకు ప్రమాదకరంగా మారి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని తెలిపింది. ప్రతి సంవత్సరం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి చాలా కలుషితమవుతుందని, అక్టోబర్ తరువాత ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుందని, నా లాంటి 12 ఏండ్ల పిల్లలు ఢిల్లీ వంటి మహానగరాల్లో ఎలా నివసించాలో తెలియక ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ సమస్య గురించి త్వరలో ఏమీ చేయకపోతే.. రాబోయే సంవత్సరాల్లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి, మనుగడ సాగించడానికి ఆక్సిజన్ సిలిండర్‌ను మనతో తీసుకెళ్లాల్సి వస్తుందని  భయపడుతున్నానని లేఖలో పేర్నొన్నారు. దయచేసి మా భవిష్యత్ గురించి ఆలోచించండి. ఆక్సిజన్ సిలిండర్లు పిల్లల జీవితంలో భాగం కాదని నిర్ధారించుకోవడం ద్వారా మాకు సహాయం చేయండని కోరింది. 

ఐక్యరాజ్యసమితి నిర్వహించిన 2019 క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో మరో 15 మంది విద్యార్థులతో రిధిమా పాండే పాల్గొన్నారు. "నాకు మంచి భవిష్యత్ కావాలి. నా భవిష్యత్ ను కాపాడుకోవాలనుకుంటున్నాను. మన భవిష్యత్ ను కాపాడుకోవాలనుకుంటున్నాను. పిల్లలందరి భవిష్యత్ ను, భవిష్యత్ తరాల ప్రజలందరినీ నేను కాపాడుకోవాలనుకుంటున్నాను" అని ఆమె చెప్పి అందరి మనసుల్ని దోచుకుంది.