బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 01:11:17

స్కూళ్లలో సరి-బేసి

స్కూళ్లలో సరి-బేసి

  • తరగతుల వారీగా 12 టీవీ చానల్స్‌
  • ఎన్సీఈఆర్టీ, కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ తర్వాత పాఠశాలలను తిరిగి తెరిచినప్పుడు సరి, బేసి విధానం అమలు చేయాలని జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) భావిస్తున్నది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా వారం విడిచి వారం 50 శాతం మందితో తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నది. ఈ విధానం వల్ల స్కూలుకు దూరంగా ఉండే విద్యార్థులు ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా, చదువు నష్టపోకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలతోపాటు విద్యార్థులతో ముఖిముఖిగా చర్చించే విధి విధానాలను రూపొందిస్తున్నది. అలాగే 1 నుంచి 12 తరగతుల వారీగా 12 టీవీ చానల్స్‌ ప్రారంభించే యోచనలో ఉన్నది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఎలాంటి అవరోధం లేకుండా ఎన్సీఈఆర్టీ ఈ చర్యలు చేపడుతున్నది. దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్డీ)కి సోమవారం సమర్పించవచ్చని తెలుస్తున్నది. పరిశీలించిన అనంతరం సంబంధిత మార్గదర్శకాలకు ఎంహెచ్‌ఆర్డీ త్వరలో ఆమోదం తెలుపవచ్చని సమాచారం. 

పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్లు ఉచితంగా ఇవ్వాలి

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల సౌలభ్యాన్ని పొందేందుకు పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, టాబ్స్‌ లేదా స్మార్ట్‌ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజావ్యాజ్యం దాఖలైంది. జస్టిస్‌ ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిల్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తమ స్పందనను జూన్‌ 10 నాటికి తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేసింది.


logo