గురువారం 16 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:17

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

  • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
  • ముగ్గురు చిన్నారులు సహా 12 మంది మృతి
  • మరో 14 మందికి తీవ్ర గాయాలు
  • మృతుల్లో 9 మంది ఖమ్మం జిల్లా వాసులు
  • వేదాద్రి దర్శనానికి వెళ్లొస్తుండగా ఘటన

ఎర్రుపాలెం/హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బండిపాలెంరోడ్డులో ట్రాక్టర్‌-లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. వీరిలో ఏడుగురు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన వారు, కాగా ఇద్దరిది జమలాపురం, మరో ముగ్గురిది కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామం. వీరంతా ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ  ప్రమాదం చోటుచేసుకున్నది. 26 మంది ప్రయాణిస్తున్న ఈ ట్రాక్టర్‌ జగ్గయ్యపేట మండలం బండిపాలెం రోడ్డులోని ఓ సిమెంట్‌ కర్మాగారం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీతోపాటు ట్రాక్టర్‌ట్రాలీ, ఇంజిన్‌ వేరై రోడ్డు పక్కన ఉన్న ముళ్లకంపల్లోకి దూసుకెళ్లాయి. 


మొక్కులు తీర్చుకొని వస్తుండగా..

ఖమ్మం జిల్లా  పెద్ద గోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి గోపిరెడ్డి దంపతులు కొత్త ట్రాక్టర్‌ కొనుగోలు చేసిన సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం సాయంత్రం ట్రాక్టర్‌పై వేదాద్రి వెళ్లారు. బుధవారం మొక్కులు తీర్చుకొని తిరిగి ట్రాక్టర్‌పై స్వగ్రామానికి వచ్చే క్రమంలో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ట్రాక్టర్‌లో 26 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో పెద్దగోపవరానికి చెందిన వేమిరెడ్డి పుల్లారెడ్డి(60), వేమిరెడ్డి భారతమ్మ(50), వేమిరెడ్డి పద్మావతి(45), వేమిరెడ్డి ఉదయశ్రీ(7), అదేగ్రామానికి చెందిన రాజేశ్వరి(26), జమలాపురం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి అప్ప మ్మ (50), లక్కిరెడ్డి తిరుపతమ్మ(45), ఏపీలోని కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి(46), గూడూరు రమణమ్మ(40), ఉపేందర్‌రెడ్డి (15) అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రుల్లో 12 మందిని ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వేమిరెడ్డి కల్యాణి(16), శీలం లక్ష్మి(20) మృతిచెందారు. మరో పదిమందికి చికిత్స అందిస్తున్నారు. నలుగురిని కృష్ణా జిల్లాలోని వేర్వేరు దవాఖానలకు తరలించారు. 

పెద్దగోపవ రం గ్రామానికి చెందిన మృతులు ఏడుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ముగ్గు రు మైనర్లు ఉన్నారు. ప్రమాదస్థలంలో ప్రాణాలు కోల్పోయిన పదిమంది మృతదేహాలను జగ్గయ్యపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, జమలాపురం, కృష్ణా జిల్లా జయంతి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పువ్వాడ పరామర్శించి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి 

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం రోడ్డులో జరిగిన  రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 


logo