మంగళవారం 07 జూలై 2020
National - Jun 15, 2020 , 09:49:38

దేశంలో కొత్తగా 11,502 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 11,502 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తున్నది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల ఒక్క రోజులో 325 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,424కి పెరిగింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 1,53,106 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,69,798 మంది బాధితులు కోలుకున్నారు. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 9520 మంది మరణించారు. 

దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1,07,958కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 3950 మంది మరణించారు. 53,030 యాక్టివ్‌ కేసులు ఉండగా, 50,978 మంది బాధితులు కోలుకున్నారు. అత్యధిక కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 44,661 కరోనా కేసులు నమోదవగా, 435 మంది మృతిచెందారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 41,182కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1327 మంది మరణించారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 23,544 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1477 మంది చనిపోయారు. 

దేశంలో కరోనా రికవరీ రేటు 50 శాతం దాటినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా బారినపడిన వారిలో 50.59 శాతం మంది కోలుకున్నారని, కరోనా బాధితులకంటే కోలుకున్న వారిసంఖ్య 13,031 అధికంగా ఉన్నదని తెలిపింది. రెండు నెలల క్రితంతో పోలిస్తే మరణాల రేటు 2.86 శాతానికి తగ్గిందని, ఇది 3.26 శాతంగా ఉన్నదని వెల్లడించింది. గుజరాత్‌, తమిళనాడులో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని, మహారాష్ట్ర, ఢిల్లీలో రికవరీరేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొంది.  


logo