హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరిగింది. ఈ పోలింగ్లో అతి శీతల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా 103 ఏళ్ల వృద్ధుడు శ్యామ్ సరన్ నేగి బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. శ్యామ్ సరన్ నేగి భారతదేశంలో అత్యంత ఎక్కువ వయసు గల ఓటరుగా ఉన్నాడు. కల్పాలో జరిగిన పోలింగ్లో కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఎన్నికల్లో ఓటు వేయడం పట్ల నేగి సంతోషం వ్యక్తం చేశారు.
1951-52 సాధారణ ఎన్నికలు మొదలుకొని లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ ఇలా ఎన్నిక ఏదైనా ఓటేసే అవకాశాన్ని తానెప్పుడు మిస్ కాలేదని తెలిపాడు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరారు. పోలింగ్ కేంద్రానికి విచ్చేసిన నేగికి డిప్యూటీ కమిషనర్ హేమరాజ్ బైర్వా స్వాగతం పలికారు. హిమాచల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. ఈవాళ జరిగిన తొలి దశలో 1200 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. రెండో దశ జనవరి 19, మూడో దశ జనవరి 21వ తేదీన జరగనుంది.