సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:35:31

అద్వానీని నాలుగున్నర గంటలకుపైగా ప్రశ్నించిన సీబీఐ కోర్టు

అద్వానీని నాలుగున్నర గంటలకుపైగా ప్రశ్నించిన సీబీఐ కోర్టు

లక్నో: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని లక్నో సీబీఐ కోర్టు శుక్రవారం ప్రశ్నించింది. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సుమారు నాలుగున్నర గంటలకు‌పైగా సాగిన ఈ విచారణలో వందకుపైగా ప్రశ్నలను సీబీఐ ప్రత్యేక కోర్టు సంధించింది. మరోవైపు ఈ కేసులో తనపై వచ్చిన అన్ని ఆరోపణలను 92 ఏండ్ల అద్వానీ తిరస్కరించినట్లు ఆయన తరుఫు న్యాయవాది తెలిపారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న తరుణంలో అద్వానీని సీబీఐ కోర్టు విచారణ జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. వీరిద్దరు సుమారు 30 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.

ఈ కేసులో ఆరోపణలున్న బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని కూడా సీబీఐ ప్రత్యేక  కోర్టు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడతున్న లక్నో సీబీఐ కోర్టు ఆగస్టు 31న తుది తీర్పు వెల్లడించనున్నది.



logo