గురువారం 28 మే 2020
National - Apr 24, 2020 , 02:25:04

అమెరికాలాగా కల్లోలమే!

 అమెరికాలాగా కల్లోలమే!

  • లాక్‌డౌన్‌ గట్టిగా పాటించపోతే  భారత్‌లో 111 కోట్లమందికి వైరస్‌
  • విలయం  సృష్టించబోతున్న కరోనా
  • భారత్‌కు అమెరికా సంస్థ హెచ్చరిక
  • కేంద్ర, రాష్ర్టాల భిన్న నిర్ణయాలతోదేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి
  • అందుకే అమెరికా పెద్ద దెబ్బతిన్నది
  • చైనా నిపుణుడు  వెన్‌హాంగ్‌ విశ్లేషణ

లాక్‌డౌన్‌! ప్రపంచాన్ని ్లకల్లోలానికి గురిచేస్తున్న కరోనా మహమ్మారికి ఉన్న ఏకైక మందు! ఈ లాక్‌డౌన్‌ను పటిష్టంగా పాటించకపోవడం వల్లే అమెరికా పెను విపత్తును ఎదుర్కొంటున్నది! స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయిందీ అందుకే! మరి భారత్‌ పరిస్థితి? దేశంలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేయకపోతే సెప్టెంబర్‌ నాటికి 111 కోట్లమంది వైరస్‌ బారిన పడే అవకాశం ఉన్నదని ప్రతిష్ఠాత్మక అధ్యయన సంస్థలతోపాటు విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇకనైనా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగకపోతే యావత్‌ దేశ ప్రజలకు వైరస్‌ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నిబంధనల్ని కఠినంగా అమలుచేయకపోవడం, కేంద్రం-రాష్ర్టాలు భిన్నమైన నిర్ణయాలు పాటిస్తుండటం వల్ల రానున్న రోజుల్లో భారత్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకోబోతున్నదా? కరోనా కేసుల్లో అమెరికా బాటలోనే పయనించనున్నదా? అమెరికా సంస్థ, చైనాకు చెందిన  వైద్య నిపుణుడు చేసిన తాజా హెచ్చరికలు ఆందోళన కలుగజేస్తున్నాయి.

ఆపత్కాలం ముందున్నది

సెప్టెంబర్‌ నాటికి దేశ జనాభాలో 111 కోట్ల మందికి వైరస్‌ సోకే అవకాశమున్నదని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌, డైనమిక్స్‌ అండ్‌ ఎకనామిక్‌ పాలసీ (సీడీడీఈపీ) ఓ నివేదికలో పేర్కొంది. కరోనాపై భారత్‌ పోరాటం చేస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని.. సగటున 55 కోట్ల నుంచి గరిష్ఠంగా 138 కోట్ల వైరస్‌ కేసులు (దేశం మొత్తం జనాభా) నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది. లాక్‌డౌన్‌లో ఇస్తున్న సడలింపులు దీనికి ఒక కారణంగా అభిప్రాయపడింది. అయితే ఈ అంచనాలను ప్రస్తుత గణాంకాల ప్రకారం వెల్లడిస్తున్నామని తెలిపింది. వైరస్‌ సోకినప్పటికీ రోగుల్లో లక్షణాలు కనిపించకపోవటం పెద్ద సమస్య అని, దీని వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్‌బారిన పడే ప్రమాదమున్నదన్నది. 

100 శాతం లాక్‌డౌన్‌ ఉత్తమం

కొవిడ్‌-19 కేసుల్లో భారత్‌ అమెరికా బాటలో పయనిస్తున్నదని.. త్వరలోనే దేశంలో వైరస్‌ కేసులు పెద్ద మొత్తంలో పెరుగనున్నాయని చైనాకు చెందిన వైద్య నిపుణుడు, కొవిడ్‌-19 విశ్లేషకుడు, హౌషాన్‌ దవాఖాన డైరెక్టర్‌ వెన్‌హాంగ్‌ హెచ్చరించారు. ‘కరోనా కట్టడికి అమెరికాలోని రాష్ర్టాలు భిన్నమైన చర్యల్ని అవలంబించాయి. కొన్ని రాష్ర్టాలు ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తే, మరికొన్ని రాష్ర్టాలు ఆంక్షల్ని సడలించి వ్యాపార కార్యకలాపాలకు అనుమతులిచ్చాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులే భారత్‌లో ఉన్నాయి’ అని తెలిపారు. వైరస్‌ కట్టడికి చైనా లాక్‌డౌన్‌, మాస్‌ క్వారంటైన్‌ వంటి చర్యల్ని కఠినంగా అమలు చేసిందని, అయితే, భారత్‌ ఈ విధంగా చేయట్లేదన్నారు. చైనాలో విధించిన 100 శాతం లాక్‌డౌన్‌ అన్ని దేశాలు పాటిస్తే మంచిదని ఆయన సలహానిచ్చారు. 

కేంద్రం అటూ.. రాష్ర్టాలు ఇటూ.. 

భారత్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్ఠ నిర్ణయాలు తీసుకోవాలని, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సీడీడీఈపీ సూచించింది. లాక్‌డౌన్‌ పరిమితులు ఇస్తూ మార్పులు చేయడం, సడలింపులు ఇవ్వడం మంచిది కాదని హెచ్చరించింది. కేంద్రం-రాష్ట్రాలు, రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య భిన్నమైన ఆంక్షలు, విధానాలు అమలు చేస్తుండటం గందరగోళానికి దారి తీస్తున్నదని, దాని వల్ల లక్ష్యం నెరవేరటంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. దాదాపు ఇవే అభిప్రాయాల్ని వెన్‌హాంగ్‌ కూడా వ్యక్తపరిచారు. 

తప్పు చేయొద్దు: డబ్ల్యూహెచ్‌వో

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తప్పు చేయొద్దని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ హెచ్చరించారు. ‘తప్పు చేయకండి. మనం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉన్నది. ఈ వైరస్‌ మనతో చాలా కాలం ఉంటుంది’ అని అన్నారు. logo