సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 19:05:38

పది రాష్ట్రాల నుంచే.. 79 శాతం కరోనా కేసులు

పది రాష్ట్రాల నుంచే.. 79 శాతం కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల్లో 79 శాతం పది రాష్ట్రాల నుంచేనని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. దేశంలో కరోనా కేసుల నమోదు తీవ్రత తగ్గుతుండగా కరోనా నియంత్రణలో నమూనాగా నిలిచిన కేరళలో రోజువారీ కేసుల నమోదు మహారాష్ట్రను దాటడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర, కేరళలో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో రోజువారీ కరోనా కేసుల నమోదు వేలల్లో ఉంటున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో ఒక్క రోజే 115 మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 6,10,803 పాజిటివ్‌ కేసులు మొత్తం కేసుల్లో 7.64 శాతమని తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 72,59,509గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో ప్రతి రోజు 7 వేలకుపైగా కరోనా రోగులు కోలుకుంటున్నారని వివరించింది. కరోనా పరీక్షల పెంపు, నియంత్రణ చర్యల వల్ల దేశంలో కరోనా మరణాల రేటు 1.50 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో 10,66,786 కరోనా పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిపిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 10.5 కోట్ల మార్కును (10,54,87,680) దాటినట్లు వివరించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.