మంగళవారం 14 జూలై 2020
National - Jun 20, 2020 , 01:45:42

10 మంది జవాన్ల విడుదల!

10 మంది జవాన్ల విడుదల!

  • మూడ్రోజుల నిర్బంధం అనంతరం విడుదల చేసిన చైనా
  • విశ్వసనీయ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 19: గల్వాన్‌ ఘర్షణ తర్వాత పదిమంది భారత సైనికులను చైనా మూడ్రోజులపాటు నిర్బంధించినట్లు తెలుస్తున్నది.సైనిక, దౌత్య మార్గాల్లో మూడు దఫాల చర్చల అనంతరం వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేసింది. ఇద్దరు అధికారులు సహా 10 మంది జవాన్లు గురువారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 1962 యుద్ధం తర్వాత భారత జవాన్లు చైనాకు చిక్కడం ఇదే తొలిసారి.  గురువారం మేజర్‌ జనరల్‌ అభిజిత్‌ బాపత్‌.. అదే స్థాయి చైనా అధికారితో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే తమ ఆధీనంలో ఉన్న భారతీయ సైనికులను చైనా విడుదల చేసింది. దీంతో ఎల్‌ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణకు తిరిగి చర్చలు జరిపేందుకు మార్గం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.

భారత సైనికులు మా బందీలుగా లేరు: చైనా 

తమ సైన్యంవద్ద భారత సైనికులు ఎవరూ ప్రస్తుతం బందీలుగా లేరని చైనా విదేశాంగశాఖ ప్రకటించింది. పరిస్థితులను సాధారణ స్థాయికి తెచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ శుక్రవారం తెలిపారు. ‘ద్వైపాక్షిక సంబంధాలను చైనా గౌరవిస్తుంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా భారత్‌ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 


logo