శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 17:38:23

మేం అధికారంలోకి వస్తే 10 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు : తేజ‌స్వీ యాద‌వ్

మేం అధికారంలోకి వస్తే 10 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు : తేజ‌స్వీ యాద‌వ్

పాట్నా : బిహార్‌లో రాష్ర్టీయ జ‌న‌తాద‌ళ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌క‌టించారు. మీడియా స‌మావేశం ద్వారా ఆయ‌న మాట్లాడుతూ... ఆర్జేడీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే మొదటి క్యాబినెట్ సమావేశంలో మొదటి సంతకంతోనే 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వబడతాయ‌న్నారు. ఇది కేవలం వాగ్దానం మాత్రమే కాద‌ని త‌మ బలమైన సంకల్పం అని తెలిపారు. ఇవి తాత్కిలిక, ప్రైవేటు ఉద్యోగాలు కావ‌ని.. ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా శాశ్వతమైనవ‌న్నారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌ని ఉద్దేశిస్తూ.. గ‌త 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న వారి అబ‌ద్దాల‌ను ప్ర‌జ‌లు ఇప్ప‌టికే చూశారని తేజ‌స్వీ యాద‌వ్ అన్నారు. 

డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలన్నారు. బీహార్‌లో పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న స్థానాల గురించి, ఇంకా సృష్టించాల్సిన వాటి గురించి కూడా ఆయన మాట్లాడారు. బీహార్‌లో 12.5 కోట్ల జనాభా ఉంది. 1.25 లక్షల మంది వైద్యుల అవ‌స‌రం ఉంది. ఆరోగ్య శాఖకు 2.5 లక్షల మంది సిబ్బంది అవసరం. పోలీసు బలగాలలో 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం లక్ష జనాభాకు కేవలం 77 మంది పోలీసులు ఉన్నారు. చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లో లక్ష జనాభాకు వెయ్యి మంది పోలీసులు ఉన్న‌ట్లు తేజస్వి చెప్పారు. రాష్ట్రం నిరుద్యోగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. సెప్టెంబర్ 5 న తమ‌ పార్టీ ప్రారంభించిన "నిరుద్యోగ పోర్టల్స్ష లో రాష్ట్రం నుండి 22 లక్షల మంది నమోదు చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి అక్టోబ‌ర్ 28న తొలి ద‌శ పొలింగ్ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే.


logo