బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 03:08:32

ఎన్నికల వ్యయం 10% పెంపు

ఎన్నికల వ్యయం 10% పెంపు

  • ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గరిష్ఠ వ్యయం రూ.77 లక్షలు
  • అసెంబ్లీ ఎన్నికలకు రూ.30.8 లక్షలు
  • కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. కరోనా ఆంక్షల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సు మేరకు ఎన్నికల వ్యయాన్ని 10 శాతం  పెంచుతూ కేంద్ర న్యాయ శాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీచేసింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఒక లోక్‌సభ ఉప ఎన్నికతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న 59 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తాజా పెంపు దోహదపడనుంది. నోటిఫికేషన్‌ ప్రకారం.. లోక్‌సభ అభ్యర్థులు ఇకపై గరిష్ఠంగా రూ.77 లక్షల వరకు వ్యయం చేయవచ్చు. ఇంతకుముందు ఇది రూ.70 లక్షలుగా ఉన్నది. అసెంబ్లీ అభ్యర్థుల వ్యయాన్ని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకు పెంచారు. అయితే అభ్యర్థుల గరిష్ఠ వ్యయం రాష్ర్టానికి రాష్ర్టానికి మధ్య వేర్వేరుగా ఉన్నది. కరోనా సంక్షోభ సమయంలో నిర్వహించే ఎన్నికలకే ఈ పెంపు పరిమితమవుతుందా లేదా అన్నది నోటిఫికేషన్‌లో స్పష్టంచేయలేదు. తక్షణమే పెంపు అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఒక కారణంగా గరిష్ఠ వ్యయాన్ని పెంచామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నా, ఆ కారణమేంటో చెప్పలేదని ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.