ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 11:06:14

కర్ణాటకలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

కర్ణాటకలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

బెంగళూరు: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నవేళ కర్ణాటకలో పదోతరగతి (ఎస్‌ఎస్‌ఎల్సీ) పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు మొదట థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతిఒక్కరికి శానిటైజర్‌తోపాటు, మాస్కులను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,48,203 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పూర్తిగా శానిటైజ్‌ చేశామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, విద్యార్థుల జీవితంలో పదో తరగతి అనేది ఒక మైళురాయి వంటిదని విద్యాశాఖ మంత్రి సురేశ్‌ కుమార్‌ అన్నారు. చాలా మందిని సంప్రథించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మేము స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను హైకోర్టుకు సమర్పించామని, దీనికి కోర్టు అనుమతించిందని మంత్రి వెల్లడించారు.


విద్యార్థుల భద్రతకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, కరోనా నిబంధనల మేరకు ఒక్కో తరగతి గదికి 18 నుంచి 20 మందిని కేటాయించామని చెప్పారు. పరీక్ష హాలులో భౌతికదూరం పాటిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని, మాస్కులు లేనివారికి వాటిని అందిస్తున్నామని వెల్లడించారు. ఆయన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. 


కర్ణాటకలో ఇప్పటివరకు 10,118 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 164 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేంద్రంగా బెంగళూరు ఉన్నది. నగరంలో 501 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సహా చాలా రాష్ర్టాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి.


logo